బంగారం ధరలు భగ్గుమన్నాయి. పదిగ్రాముల పుత్తడి 40 వేల రూపాయలు దాటింది. నిన్నామొన్నటిదాక 38 వేల రూపాయలున్న బంగారం ధర... కొండెక్కింది. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై 600 రూపాయలకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో పుత్తడి మెరుపులు మొదలయ్యాయి. వెండి సైతం పుత్తడితో పోటీపడుతూ పరుగులు పెడుతోంది. 

 

బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 40 వేల రూపాయలు దాటింది. మార్కెట్ లో ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 41 వేయ్యి 370 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 37 వేల 940 రూపాయలుగా ఉంది. నిన్నటిధరలతో పోలిస్తే... ఈ ఒక్కరోజే పది గ్రాముల బంగారం  ధరపై 100 రూపాయలు పెరిగింది. నిన్న ఏకంగా 10 గ్రాముల గోల్డ్‌ పై 600 రూపాయలు పెరిగింది. 


 
గత పది రోజుల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ 39 వేల 960  రూపాయలుంటే... 22 క్యారెట్ల గోల్డ్‌ 36 వేల 650 రూపాయలుగా ఉంది.  పది రోజుల్లోనే 1400 రూపాయలకుపైగా పెరిగింది. పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. 

 

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ మిలిటరీ అధికారి మరణించడంతో పసిడి మెరుపులు మొదలయ్యాయి. అమెరికా చేసిన రాకెట్‌ దాడిలో ఇరాన్‌ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ సులేమాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్ల చూపు పసిడిపై పడింది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం జోరందుకుంది. 

 

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపింది. మరోవైపు వెండి సైతం పుత్తడితో పోటీగా పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ ధర కేజీ 47 వేల 384 రూపాయలుగా ఉంది. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ గా ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు... వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్‌.. వాణిజ్య యుద్దాలు.. ఉద్రిక్తతలు... ఇలా పలు అంశాలు పుత్తడి, వెండి ధరల పెరుగుదలపై ప్రభావం చూపాయి. 

 

ప్రస్తుతం నాలుగు నెలల గరిష్టస్థాయికి చేరుకున్న బంగారం ధరలు మరింత పెరుగుతాయంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. సంక్రాంతి తర్వాత అంటే... ఫిబ్రవరి నెలాఖరు, మార్చి, ఎప్రిల్‌, మే నెలల్లో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో.. బంగారం కొనుగోలుదారుల్లో గుబులు రేగుతోంది. మరింత పెరుగుతాయని అంటుండటంతో... ఇప్పుడే కొనేద్దామని కొందరు... తగ్గుతుందేమో వేచిచూద్దాం అని మరికొందరు ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: