కరువు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అనంతపురం జిల్లానే. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మూడు పంటలు పండే కోస్తా జిల్లాల కంటే ఇక్కడ వ్యవసాయం చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది. పండ్లతోటలు పండించడంలో దేశంలోనే అనంతకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పండే అరటి పంట ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంటర్నేషనల్ స్ట్రాండర్డ్స్ తో జరిగే ఈ ఎగుమతులను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. 

 

 తీవ్ర కరవుతో అల్లాడే అనంతపురం జిల్లాలో పంటలు పండక రైతులు అల్లాడిపోతుంటారు. నీటి వనరులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ బోర్లు, బావుల కింద మాత్రం అద్భుతమైన పండ్ల తోటల సాగు జరుగుతుంది. అరటి, జామ, దానిమ్మ, బత్తాయి, సపోట పంటలు ప్రధానమైనవి. ఇక్కడి భూములు చాలా సారవంతంగా ఉండటంతో పండ్ల తోటల సాగుకు అనువుగా ఉంటాయి. దేశవ్యాప్తంగా అనంత ఫ్రూట్స్‌ కు  మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్రధానంగా అరటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 

 జిల్లా వ్యాప్తంగా 16వేలకు పైగా హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. 11.65 లక్షల మెట్రిక్ టన్నుల మేర పంట దిగుబడి వస్తోంది.  ఈ ప్రాంత అరటికి బెంగళూరు, చెన్నై, కలకత్తా లాంటి దేశీయ మార్కెట్లతో పాటు యూరప్, మధ్య ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వివిధ కంపెనీలు ఇక్కడ అరటిని కొనుగోలు చేసి తర్వాత ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసినట్లు చెబుతున్నా.. తొలిసారిగా అరబ్ దేశాలకు నేరుగా ఎగుమతి చేయనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రయిన్ వంటి అరబ్ దేశాలకు~ఇక్కడి అరటి ఉత్పత్తుల ఎగుమతికి మార్గం సుగమమైంది.  493 మెట్రిక్ టన్నుల జీ9 రకం అరటిని ఎగుమతికి సిద్ధం చేశారు.  జిల్లాలోని తాడిపత్రి నుంచి 43 బోగీలు కలిగిన ప్రత్యేక రైలు వ్యాగన్‌ను ఏర్పాటు చేశారు. తొలివిడతగా 890 మెట్రిక్ టన్నుల అరటిని నిబంధనల మేరకు ప్యాకింగ్ చేసి కంటైనర్లలో సిద్ధంగా ఉంచారు. 'హ్యాపీ బనానా' పేరుతో ఇక్కడి అరటి సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్, దుబాయ్ ప్రాంతాలకు వెళ్లనుంది.

 

ఎన్నో ఏళ్లుగా అనంత ఫ్రూట్స్ విదేశాలకు ఎగుమతి అవుతున్నా.. అది పరోక్షంగానే ఉండేది. ఇప్పుడు నేరుగా రైతుల నుంచే విదేశాలకు వెళ్లడం హర్షదాయకమంటున్నారు రైతులు. ఇలానే మరిన్ని రకాల పండ్లు విదేశాలకు ఎగుమతి అయితే అనంత హార్టీకల్చర్ హబ్ గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: