ప్రతిసారి కాటేసే కాలం ఈ సారి కనికరించడంతో పంట దిగుబడి బాగా వచ్చింది. నాలుగు పైసల లాభం కళ్ల చూస్తామనుకుంటున్న తరుణంలో.. కొనుగోళ్ల కేంద్రాల్లో నిబంధనలు నానా తిప్పలు పెడుతున్నాయి. మార్కెట్లలో దళారులదే ఇష్టారాజ్యమైంది. దీంతో.. మద్దతు ధర కావాలంటూ రోడ్డెక్కి ఆర్తనాదాలు పెడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతన్నలు.

 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది సుమారు లక్షన్నర హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగైంది. వాతావరణం అనుకూలించడంతో.. హెక్టారుకు గరిష్టంగా దిగుబడి వచ్చింది. క్వింటాల్ కందిని 5,800 రూపాయల చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో రైతులకు కొనుగోలు కేంద్రాల నిబంధనలు షాకిస్తున్నాయి.

 

ఎకరాకు మూడు క్వింటాళ్ల కందిని మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి కేంద్రాలు. మిగతా వాటిని ఎవరు కొనుగోలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయశాఖ ఇచ్చిన అంచనాలకు 10 శాతం కంటే తక్కువ మార్క్‌ఫెడ్ కొనాలని నిర్ణయించింది. దీంతో రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు అన్నదాతలు.

 

మరోవైపు కొనుగోలు కేంద్రాల నిబంధనలతో నానా తిప్పలు పడుతున్నారు రైతులు. అమ్మడానికి వచ్చే రైతులు తప్పనిసరిగా సాగు దృవీకరణ పత్రాలు తేవాలంటున్న అధికారులు.. టోకన్ల కోసం రైతులను గంటల కొద్ది నిలబెడుతున్నారు. టోకెన్‌ దొరికిన తర్వాత గోనె సంచుల కోసం, ఆ తర్వాత కాంటాల కోసం.. ఇలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. టోకెన్ దక్కకుంటే రైతు రాత్రంతా మార్కెట్ యార్డులో జాగారం చేయాల్సిందే.

 

ఇలా అనేక నిబంధనలు పెట్టడంతో.. వేరే దారిలేక ప్రైవేటు దళారులకు పంటను అమ్ముకుంటున్నారు రైతులు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో పరిమితులు ఎత్తివేసి.. పండిన ధాన్యాన్ని కొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మొత్తానికి కొత్త నిబంధనలు కంది రైతులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: