దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో నిరుద్యోగం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యావంతుల్లో నిరుద్యోగం అధికంగా ఉందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ చెబుతోంది. కేంద్రం దేశంలో నిరుద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా కేంద్రం ఉపాధి కల్పిస్తోంది. 
 
ఈ పథకం ద్వారా కేంద్రం సేవా పరిశ్రమకు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, ఉత్పత్తి పరిశ్రమకు గరిష్టంగా 25 లక్షల రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తుంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖల ద్వారా ఈ పథకం అమలవుతోంది. యువతకు కేంద్రం కుటీర పరిశ్రమలు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 
 
ఈ పథకం ద్వారా కొత్త పరిశ్రమలు, అన్ని రకాల గ్రామీణ పరిశ్రమలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. గతంలో ప్రారంభించిన పరిశ్రమలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేవు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు 10 శాతం పెట్టుబడిని ప్రాజెక్ట్ వ్యయంలో భాగంగా భరించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిటైర్డ్ సైనికులు, దివ్యాంగులు 5 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేసి లబ్ధిదారుడికి అందజేస్తాయి. 
 
అభ్యర్థులు https://www.kviconline.gov.in/ వెబ్ సైట్ ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సు నిండినవారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి కనీసం 8వ తరగతి పాసైన వారు మాత్రమే అర్హులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: