దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు సెలవులు వస్తే కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోతాయి. ఏటీఎంలలో ప్రజలు నగదు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా ఆరు రోజులపాటు లావాదేవీలు నిలిచిపోనుండటంతో ఖాతాదారులు అసౌకర్యానికి గురి కావాల్సిందే. 
 
మార్చి నెల రెండవ వారంలో వరుసగా ఆరు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేతనాలను పెంచాలని మార్చి నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల యాజమాన్యాలు 12.5 శాతం పెంపుకు అంగీకరిస్తుంటే సంఘాలు మాత్రం 20 శాతం వేతనం పెంచాలని కోరుతున్నాయి. 
 
మార్చి 10వ తేదీ మంగళవారం హోళీ సందర్భంగా సెలవు కాగా 11,12,13 తేదీలలో సమ్మె వలన బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 14వ తేదీ రెండో శనివారం సందర్భంగా సెలవు కాగా మార్చి 15వ తేదీన ఆదివారం కావడంతో వరుసగా ఆరు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి నెల 5వ తేదీన సమ్మె గురించి కేంద్ర లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరగనున్నాయి. 
 
చర్చలు సఫలం అయితే బ్యాంకు ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చర్చలు సఫలం కాకపోతే మాత్రం ఖాతాదారులు ఇబ్బందులు పడక తప్పదు. ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక జాతీయ బ్యాంక్ ఉన్నతాధికారి లేబర్ కమిషనర్ దగ్గర జరిగే చర్చల తరువాత సెలవుల గురించి స్పష్టత వస్తుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: