అమెరికా అధ్యక్షుడి పర్యటనపై ఇండియా చాలా ఆశలు పెట్టుకుంది. అనేక పెట్టుబడుల వస్తాయని ఆశించింది. అయితే ఇక్కడో రివర్స్ అటాక్ జరుగుతోంది. అమెరికా పెట్టుబడుల కోసం ఇండియా చూస్తుంటే ఇప్పుడు ఇండియా పెట్టుబడుల కోసం అమెరికా ఎదురు చూస్తోంది. అవును ఇది నిజం.

 

 

తన పర్యటన రెండో రోజు ఈ విషయంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ట్రంప్ సమావేశమై పలు అంశాలపై వారితో ముచ్చటించారు. రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలకు అవకాశం చిక్కిందన్న ట్రంప్ ఒబామా కేర్ ను మించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్నితీసుకొచ్చినట్లు చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు వెల్లడించారు.

 

 

అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటూ ఇండియన్ కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, ఆదిత్యాబిర్లా సంస్థల ఛైర్మన్ కుమార మంగళం బిర్లాలను ట్రంప్ కోరారు. ఇండియా కంపెనీల కోసం అవసరమైతే వాణిజ్య నిబంధనలు మారుస్తామని కూడా ఊరించారు ట్రంప్.

 

వచ్చే అమెరికా ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముంచెత్తుతాయంటున్నారు ట్రంప్. లేనిపక్షంలో భారీగా నష్టాలను మూటగట్టుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. మరి ఇండియా కంపెనీలు అమెరికా వెళ్తాయా.. అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తాయా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: