బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త... బ్యాంకులు మూడు రోజుల పాటు ఈ నెల 11 నుండి సమ్మె చేయనున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమ్మె వాయిదా పడింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన చేసింది. సమ్మె ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశామని చర్చలు అనుకూలంగా జరుగుతున్నందువలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంప్లాయీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ చెబుతోంది. 
 
బ్యాంక్ అధికారులు, సిబ్బంది వేతన సవరణ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంక్ అధికారులు సమ్మెకు పిలుపునివ్వటంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తాజాగా యూనైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపింది. 
 
ఈ చర్చల్లో 15 శాతం వేతన పెంపుకు ఇరు వర్గాలు ఆమోదం తెలపడంతో సమ్మె వాయిదా పడినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన వెలువడిన తరువాత సిబ్బంది సమ్మె విరమణ గురించి ప్రకటన చేయనున్నారు. ముంబాయిలో జరిగిన సమావేశంలో బ్యాంక్ అసోసియేషన్ తరపున వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారానికి ఐదు రోజుల పని దినాలు, ఇతర అంశాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. వేతన పెంపు వల్ల బ్యాంకులపై దాదాపు 8000 కోట్ల రూపాయల భారం పడనుందని తెలుస్తోంది. అధిక వేతనం పొందే ఉద్యోగులకు వేతన పెంపు వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: