కరోనా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలో కరోనా భారీన పడి వేల సంఖ్యలో మృతి చెందడంతో కరోనా పేరు వింటేనే జనం వణికిపోయే పరిస్థితి ఉంది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. కేంద్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కరోనా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. 
 
నిన్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ రిజర్వ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం మరింత విస్తరిస్తుండడంతో వడ్డీ రేట్లను తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ ధరల స్థిరత్వ లక్ష్యం కోసం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తరువాత ఫెడ్ అత్యవసరంగా రేట్ల కోతకు దిగడం ఇదే తొలిసారి. 
 
కరోనా అంతర్జాతీయ మాంద్యానికి దారి తీసే ప్రమాదం పొంచి ఉండటంతో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. గతేడాది మూడు విడతలుగా రేట్లను తగ్గించిన ఫెడ్ 2020లో తొలిసారి రేట్లను తగ్గించింది. ఫెడ్ ఛైర్మన్ జీరోమ్ పావెల్ మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం కొంతకాలం పాటు ఉంటుందని చెప్పారు. ఆర్థిక వృద్ధి అంచనాలకు ఉన్న రిస్క్ ను చూసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత రేట్ల కోత దిశగా ఫెడరల్ రిజర్వ్ అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు. భారత్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: