ఆర్బీఐ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. నిన్న ఆర్బీఐ యస్ బ్యాంక్ ఖాతాదారులు 50,000 రూపాయలకు మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో ఆర్బీఐ అనుమతితో నగదు తీసుకోవచ్చు. కొన్ని నెలల నుండి యస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
యస్ బ్యాంక్ కొన్ని నెలలుగా మూలధనం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావడం లేదు. మోదీ ప్రభుత్వం యస్ బ్యాంకును గట్టెక్కించడానికి ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దాదాపు 14,000 కోట్ల రూపాయల నిధులు యస్ బ్యాంకుకు అందించటానికి ఆర్బీఐకు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. బ్యాంక్ కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా కల్పిస్తోంది. 
 
మరోవైపు కేంద్రం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను యస్ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఎల్‌ఐసీ పాలు పంచుకోవాలని ఎస్బీఐ కోరినట్లు సమాచారం. యస్ బ్యాంకులో 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా త్వరలోనే వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ యస్ బ్యాంక్ మూత పడబోదంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: