గత కొన్ని రోజుల నుండి యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ అనుమతితో యస్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. యస్ బ్యాంక్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఖాతాదారులకు ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. యస్ బ్యాంక్ ఖాతాదారులు ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను ఖాతా ఉపయోగించి చెల్లించవచ్చు. 
 
యస్ బ్యాంక్ ఖాతాదారులకు ఇన్‌వర్డ్ పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఆర్బీఐ యస్ బ్యాంక్ పై విధించిన మారిటోరియంను మరికొన్ని రోజులలో తొలగించనుందని సమాచారం. మారటోరియం తొలగిస్తే యస్ బ్యాంక్ ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఎలాంటి పరిమితులు ఉండవు. యస్ బ్యాంక్ ఖాతాదారులకు మారటోరియం తొలగింపు శుభవార్త అనే చెప్పవచ్చు. 
 
ఇన్‌వర్డ్ పేమెంట్ సేవలను యస్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకురావటంతో ఖాతాదారులు ఇతర బ్యాంక్ ఖాతాల ద్వారా లోన్ పేమెంట్లను, క్రెడిట్ కార్డ్ పేమెంట్లను చెల్లించవచ్చు. యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. మరోవైపు షేరు ధర 10 రూపాయలతో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈడీ ఈ కేసులో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: