దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 498కు చేరింది. నిన్న ఒక్కరోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కొందరు భయాందోళనకు గురవుతున్నారు. 
 
అయితే కేంద్రం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ తాజాగా శుభవార్త చెప్పింది. కేంద్ర కార్మిక శాఖ కంపెనీలు ఉద్యోగులకు రిలీఫ్ అందించాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించిన మెమోరాండమ్ ను జారీ చేసింది. లాక్ డౌన్ వల్ల ఆఫీసుకు రాకపోయినా ఆన్ డ్యూటీగానే పరిగణిస్తామని... ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వేతనాలు సక్రమంగా అందుతాయని కేంద్రం తెలిపింది. 
 
ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచారం. కార్మిక శాఖ కంపెనీలను ఉద్యోగుల వేతనాల్లో కోత విధించొద్దని... కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని కోరింది. కరోనాను ఎదుర్కోవడానికి అందరి సహకారం కావాలని కేంద్రం కోరింది. కేంద్రం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30 వరకు ఉద్యోగులు సెలవులు తీసుకున్నా వారిని ఆన్ డ్యూటీగానే పరిగణించడంతో పాటు వారి వేతనాల్లో ఎలాంటి కోతలు విధించకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: