దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా ప్రభావంతో దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. కరోనా కలకలం నేపథ్యంలో అనేక సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లేదా వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తున్నాయి. లాక్ డౌన్ తో దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు నిలిచిపోవడం, కొత్త ఆర్డర్లపై అనిశ్చితితో ఇబ్బందులు పడుతున్నాయి. 
 
దీంతో ఐటీ కంపెనీలు ప్రస్తుతం వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్  కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఉద్యోగులకు ఊరటనిస్తూ లేఆఫ్స్ ఉండవని ప్రకటన చేసింది. ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వూల్లో ఉద్యోగం సాధించి విధుల్లో చేరాలని ఎదురు చుస్తున్న వారిని నిరభ్యంతరంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటన చేసింది. 
 
లాటరల్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం పొందిన వారికి సైతం ఇది వర్తిస్తుందని పేర్కొంది. నిన్న కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్ లో కంపెనీ లాభం 6 శాతం వృద్ధితో 4321 కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొంది. రాబడి 8 శాతం ఎగిసి 23,767 కోట్ల రూపాయలకు చేరిందని ప్రకటన చేసింది. కంపెనీ ఒక్కో షేరుకు 9.5 రూపాయల చొప్పున ఫైనల్ డివిడెండ్ ను ప్రకటించింది. 
 
కరోనా వల్ల వ్యాపార అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని.... పరిస్థితులు మెరుగుపడ్డాక అంచనాలను వెల్లడించామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కాగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరాల అంచనాలను అందుకోలేకపోయింది. ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ వివిధ విభాగాల్లో మంచి వృద్ధిని సాధించామని.... గత ఆర్థిక సంవత్సరం సంతృప్తికరమైన ఫలితాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ ఫరేఖ మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో వ్యాపారంపై ప్రభావం ఉంటుందని... నాణ్యమైన సేవలందించడం ద్వారా సమస్యలను అధిగమించగలమని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: