రాయ‌లు ఏలిన సీమ‌....ర‌త‌నాల సీమ అని ఊరికే అన‌లేదు...శ్రీకృష్ణ దేవ‌రాల‌య కాలంలో వ‌జ్రాల‌ను సంత‌లో కుప్ప‌లుగా పోసి అమ్మేవార‌ని అనేక చారిత్ర‌క గాధ‌ల్లో...చ‌రిత్ర పుస్త‌కాల్లో మ‌నం చ‌దువుకున్నాం. అయితే ఆ ఆన‌వాళ్ల ప్ర‌భావ‌మే...ఆ నేల మ‌హిమో తెలియ‌దు గాని నాటి వైభ‌వాన్ని రాయ‌ల‌సీమ నేల పునికి పుచ్చుకున్న‌ట్లుంది. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాకాలం వ‌చ్చిదంటే చాలు వ‌జ్రాల వేట కొన‌సాగుతుంది. తొల‌క‌రి వ‌ర్షాలు ప‌డ‌గానే వేలాది మంది జ‌నం త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూ వ‌జ్రాల వేట‌కు కుటుంబంలోని పిల్ల జెల్లాతో స‌హా ఇలా స‌కుటుంబ స‌ప‌రివారంతో దిగుతారు. 

 

అలాంటి వాతావ‌ర‌ణమే క‌నిపిస్తోంది అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో. అలాగే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ఇప్పటిదాకా వందల సంఖ్యలో వజ్రాలు దొరికిన చ‌రిత్ర ఉంది ఈ రెండు జిల్లాల్లో. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో 6 వజ్రాలు దొరికాయని గ్రామ‌స్థుల ద్వారా తెలుస్తోంది.  ఇతర జిల్లాల నుంచి సైతం వంద‌లాది మంది ప్ర‌త్యేక వాహ‌నాల్లో ఈ రెండు జిల్లాల్లోని ఆయ ప్రాంతాల‌కు చేరుకుని అవ‌స‌ర‌మైతే రోజుల త‌ర‌బ‌డి మ‌రీ వ‌జ్రాల వేట‌లో మునిగి తేలుతుంటారు. 


వాస్త‌వానికి ఈ వ‌జ్రాల వేట అనేది కేవ‌లం అదృష్టం మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న‌వారి కంటే బ‌య‌టి నుంచి వ‌చ్చిన వారికే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం మ‌రో విశేషం. ముఖ్యంగా మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. అయితే ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారుతోందంట‌. ఎందుకంటే  జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కుతుండ‌టంతో.. సాగుకు సిద్ధ‌మ‌య్యేందుకు...దున్న‌డంలో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని  రైతులు చెబుతున్నారు.  కొంతమంది అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: