స‌రిహ‌ద్దుల వ‌ద్ద క‌య్యానికి కాలు దువ్వుతున్న డ్రాగ‌న్ వ్యాపారాల‌పై భార‌త్ ఆంక్ష‌లు విధిస్తోంది. ఇప్ప‌టికే ప్లాన్ ఏ, బీ, సీలు కూడా సిద్ధ‌మైపోయాయి. ముఖ్యంగా చైనా నుంచి మన దేశానికి దిగుమతులను వీలైనంత తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు, అధిక సుంకాలు విధించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే సరుకులు, వస్తువులు రెండు రోజులుగా పోర్టుల వద్ద నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక ఓడ రేవులు, ఎయిర్‌పోర్టులకు చేరిన చైనా వస్తువుల కంటైనర్లను అక్కడి నుంచి పంపడం లేదు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఆ దేశ దిగుమతులను పోర్టుల వద్ద నిలిపివేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ఆ దేశం నుంచి వచ్చే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు పోర్టుల వద్దనే ఉంచినట్లు కొందరు చెబుతున్నారు. అయితే వాస్త‌వానికి చైనా వ్యాపారాన్ని క‌ట్ట‌డి చేసేందుకే భార‌త్ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది అన్న‌ది సుస్ప‌ష్ట‌మ‌వుతోంది. లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన భారీ ఘర్షణ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు, కాంట్రాక్టులను బహిష్కరించాలన్నడిమాండ్‌ ఊపదుకున్నది. 

 

అందులో భాగంగానే దిగుమ‌తుల‌పై ఆంక్ష‌లు విధిస్తోంది. స్థానికంగా ఉత్పత్తి చేయగలిగే వస్తువులను దిగుమతి చేసుకోకుండా ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 370 ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిపై కఠినమైన నాణ్యతా ప్రమాణాల‌ను ఖ‌రారు చేయ‌నుంది. వీటిలో రసాయనాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, ఫర్నిచర్, కాగితం, పారిశ్రామిక యంత్రాలు, రబ్బరు వ్యాసాలు, గాజు పాదార్థాలు, లోహ వస్తువులు, ఫార్మా, ఎరువులు, ప్లాస్టిక్ బొమ్మల వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉండ‌టం గ‌మ‌నార్హం.అలాగే, పలు ఇతర ఉత్పత్తులపై దిగుమతుల సుంకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏసీలు, ఆటో పరికరాలు, ఫర్నీచర్‌లపై దిగుమతి సుంకాలను పెంచడానికి కేంద్రం యోచిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: