చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోవడం భారతదేశంలో చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ జోరుగా సాగుతోంది. చైనా కంపెనీల ప్రకటనల్లో నటించొద్దంటూ క్రికెట్, సినిమా ప్రముఖులకు జ‌నాలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది మొబైల్ ఫోన్లలో చైనీస్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల చైనా ఉత్పత్తులను పగలగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగా.. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా నడిచే అవకాశం కనిపిస్తోంది.  

 

"ఆత్మనీర్భర్ భారత్" కోసం కేంద్రం ముందుకు రావడంలో భాగంగా భారతదేశంలో తయారైన వస్తువుల కొనుగోలును తమ ప్రథమ ప్రాధాన్యతగా చేసుకోవాలని సంబంధిత శాఖలన్నింటినీ మంత్రిత్వ శాఖ ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. అయితే నాణానికి మ‌రోవైపు అన్న‌ట్లుగా జ‌నాలు మాత్రం చైనా వ‌స్తువుల‌ను వ‌దులు కోవ‌డానికి సిద్ధంగా ఉన్నారా..? అంటే లేర‌నే విష‌యాన్ని ప‌లు స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వాస్త‌వానికి  ఉత్పత్తులను బహిష్కరించాలనే విషయంలో మెజారిటీ భారతీయులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేక పోతున్నార‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ తన ‘వన్‌ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌లో తీసుకొచ్చిన ‘వన్‌ప్లస్‌ 8 ప్రో’ మోడల్‌ ఫోన్లను జూన్‌ 18వ తేదీన అమెజాన్‌ ద్వారా భారత్‌లో అమ్మకాలు ప్రారంభించగా క్షణాల్లో అమ్ముడు పోయాయ‌ని చెబుతున్నారు. 

 

దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.  అలాగే చైనా కంపెనీల నుంచి స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు అతి తక్కువ ధరలకు రావడమే కాకుండా నాణ్యత కూడా బాగానే ఉంటుండంతో వాటికి భారత్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంద‌ని ఎలాక్ట్రానిక్ విక్ర‌య వ్యాపార కేంద్రాల నిర్వాహాకులు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా  ఏటా అమ్ముడుపోతోన్న స్మార్ట్‌ ఫోన్లలో 76 శాతం ఫోన్లు చైనావేనని ప‌లు మార్కెట్ స‌ర్వేలు తెలుపుతున్నాయి.  ఇదిలా ఉండ‌గా  చైనాకు చెందిన చాలా కంపెనీలు ఇప్పుడు భారత్‌లో లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నందునే దేశంలో చైనా ఉత్పత్తులపై నిషేధం సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: