చైనా ఉత్ప‌త్తుల దిగుమ‌తులపై ఆంక్ష‌లు పెట్ట‌డం సాధ్యం కాదా..? దిగుమ‌తి చేసుకోకుంటే న‌ష్ట‌పోయేది భార‌త‌దేశ‌మేనా..? అంటే అవును అనే స‌మాధాన‌మే వ‌స్తోంది మార్కెట్ విశ్లేష‌కుల నుంచి. ఎందుకంటే ఇప్ప‌టికే దాదాపు భార‌తదేశంలోని  ప్ర‌తీ ఇల్లు చైనా వ‌స్తువుల‌తో నిండిపోయాయి. వంటిల్లు నుంచి మొద‌లుపెడితే వినోదం వ‌ర‌కు ఉప‌యోగించే ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల వ‌ర‌కు చివ‌రికి ఆరోగ్య‌ప‌రంగా మందుల వ‌ర‌కు చైనావే ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. కొన్ని దీర్ఘ‌కాలిక వినియోగ వ‌స్తువుల‌కు సంబంధించిన దిగుమ‌తులను నిలిపివేయ‌డం వ‌ల‌న విడి ప‌రిక‌రాల‌కు కొర‌త ఏర్ప‌డి వినియోగ‌దారుల‌కు న‌ష్టం క‌లిగేప్ర‌మాదం ఉంటుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

 


చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో కుండ‌బద్ద‌లు కొట్టేసింది. దేశీయంగా అమ్ముడయ్యే వివిధ ఉపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని వివ‌రించింది. చైనా దిగుమతులు బహిష్కరించాలని సర్వత్రా పిలుపు వస్తున్న నేపథ్యంలో భారత తయారీ సంస్థలు పోటీ సామర్థ్యం గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుందని మారుతి సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. అదే సమయంలో పొరుగు దేశం నుంచి ఉత్పత్తులు బహిష్కరించడం అంటే కొనుగోలు చేసే వస్తువులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుందనే విషయం కూడా గమనించాలనే మార్కెట్ విధానాన్ని క‌ళ్ల‌ముందు పెట్టేశారు.

 


పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని త‌యారీ సంస్థ‌ల ప్ర‌తినిధులు పేర్కొంటున్నారు. సుదీర్ఘకాలం పాటు దిగుమతుల పైనే ఆధారపడడమనేది వాణిజ్య ప్రయోజనాల రీత్యా ఏ మాత్రం మంచిది కాదని, దిగుమతులు పెరిగిన కొద్ది ధరలు కూడా పెరిగి రూపాయి బలహీనం అవుతుందని ఆయా కంపెనీల యాజ‌మాన్యాలు కూడా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే భారత్‌లో వస్తువుల లభ్యత తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత తక్కు వ, ధరలు అధికం కావడం కూడా దిగుమతులపై ఆధారపడడానికి ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: