దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాలను నమోదు చేశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలతో దేశీయ సూచీల సెంటిమెంట్ బలపడింది. పైగా ఇండియాలో కరోనాకు వ్యాక్సిన్ తయారీపై నమ్మకం పెరుగుతుండటం వంటి అంశాలు కూడా మ‌దుప‌ర్ల‌కు ఉత్సాహాన్ని క‌లిగించాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌  వరుసగా 4రోజూ లాభంతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు  మార్కెట్‌ లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. సెన్సెక్స్‌ 301 పాయింట్ల లాభంతో 36322 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల పెరిగి 10714 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను మొదలయ్యాయి. సూచీలకిది వరుసగా 4రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. 


ఇదిలా ఉండ‌గా దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్‌ షేరుకు డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం బీఎస్‌ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం.

 

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 465.86 పాయింట్ల లాభంతో 36,487 వద్ద ముగియగా, నిఫ్టీ 156.30 పాయింట్లు ఎగిసి 10,763 వద్ద ముగిసింది. ముఖ్యంగా, నిఫ్టీ బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల బాట పట్టడంతో ర్యాలీ జోరందుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎంసీజీ, విద్యుత్, ఐటీ రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఫార్మా రంగం మాత్రమే కాస్త నీరసించింది. ఇక, సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ సూచీలు అధిక లాభాలను నమోదు చేయగా, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: