దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ఆధార్‌ను ఎయిర్‌టెల్ దుర్వినియోగం చేయడంతో ఆధార్‌ను జారీ చేసే యు.ఐ.డి.ఎ.ఐ(ఉడాయ్) కఠిన నిర్ణయం తీసుకుంది. ఆధార్ వెరిఫికేషన్‌కు అనుమతించే ఈకైవెసి లైసెన్సును ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 

తక్షణమే ఇది అమలవుతుందని పేర్కొంది. యూఐడీఏఐ నిర్ణయంతో ఈ రెండు సంస్థలు తమ ఖాతాదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు తక్షణం ఫుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా ఎయిర్‌టెల్ తన ఖాతాదారుల ఆధార్ నంబర్లను సిమ్‌తో అనుసంధానించే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది.భారతీ ఎయిర్‌టెల్ తన చందాదారులతో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు ఆధార్-ఈకైవెసీ ఆధారిత ‘సిమ్’ వెరిఫికేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు రావడంతో యు.ఐ.డి.ఎ.ఐ ఈ కఠిన చర్య తీసుకుంది.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తమ పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఓపెన్ అయిందన్న విషయం తెలియకపోవడం. ఇలా మొత్తం 23 లక్షల మందికిపైగా ఖాతాదారుల నుంచి దాదాపు రూ.47 కోట్ల వరకు జమ అయ్యాయి.  ఎల్.పి.జి సబ్సిడీ అందుకునేందుకు అటువంటి పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించుకోవడం పట్ల కూడా యు.ఐ.డి.ఎ.ఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: