ఐడిబిఐ బ్యాంకు లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసేందుకు బీమా సంస్థ ఎల్‌ఐసికి బోర్డు అమోదం లభించింది. ప్రాధాన్యతా షేర్ల ద్వారా ఐడిబిఐలో 51శాతం వాటాను ఎల్‌ఐసి సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సి గార్గ్ సోమవారం వెల్లడించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో మూలధనాన్ని సమీకరించేందుకు ఎల్‌ఐసికి ఐడిబిఐ ప్రిఫరెన్సియల్ షేర్లను జారీ చేస్తుంది. రుణాల భారంతో ఉన్న ఐడిబిఐకి ప్రస్తుతం మూలధనం అవసరమని,దీన్ని సమీకరించుకోవడంలో భాగంగానే ఎల్‌ఐసికి మెజార్టీ షేర్లను విక్రయించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్న గార్గ్ వివరించారు. 

ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల షేర్లను కొనుగోలు చేయడంలో తదుపరి చర్యగా సెబీని ఎల్‌ఐసి ఆశ్రయించాల్సి ఉంటుంది. ఐడిబిఐలో మెజార్టీ వాటా కొనుగోలుకు ఇప్పటికే ఎల్‌ఐసికి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎఐ అనుమతి లభించింది. అలాగే తన వాటా ను ఎల్‌ఐసికి విక్రయించే విషయంలో ఐడిబిఐ కూడా తన బోర్డు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.

ఐడిబిఐ షేర్ల విక్రయం విషయంలో ఓపెన్ ఆఫర్ ఉండక పోవచ్చునని, ఇందుకు కారణం ఈ బ్యాంకులో ప్రజల వాటా పరిమితం కావడమేనని గార్గ్ తెలిపారు. అయితే అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం మెజార్టీ వాటాను విక్రయించడం ద్వారా ఐడిబిఐకి పది వేల నుంచి 13వేల కోట్ల రూపాయల వరకూ మూలధన మద్దతు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఐడిబిఐ బ్యాంకు బోర్డులో నలుగురు సభ్యుల్ని నియమించుకునే అవకాశం ఎల్‌ఐసికి ఉంటుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: