కేంద్ర ప్ర‌భుత్వం విలీనాల దూకుడును కొనసాగిస్తోంది. ఎస్‌బీఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)నూ కలిపేసిన సంగతీ విదితమే. అనంత‌రం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనం జరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ),యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లను ఒక్కటి చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. 


 ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఆవిర్భావంలో భాగంగా ఇంకో మూడు పీఎస్‌బీలను ఏకం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇందులో పీఎన్‌బీ, యూబీఐ, బీవోఐ కూడా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లోగాని, మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోగాని బ్యాంకుల విలీనానికి అవకాశాలున్నాయని తెలుస్తున్నది. బ్యాంకుల విలీనాల విషయంలో కేంద్రం ఎంతోకాలం వేచి చూడబోదు. బ్యాంకులు తమకున్న అవకాశాలను అందిపుచ్చుకోకపోతే.. ప్రత్యామ్నాయ వ్యవస్థ సూచనలిస్తుంది. దాని ప్రకారం విలీనాలు జరుగుతాయి అని సదరు అధికారి స్పష్టం చేశారు.


ఎన్‌పీఏలు ప్రమాదకర స్థాయిలో ఉన్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా బ్యాంకులకు కొత్త రుణాల మంజూరు, శాఖల విస్తరణ వంటి అంశాల్లో బ్రేకులు పడ్డాయి. అయితే విలీనాల నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం పెరిగి ఆయా బ్యాంకులు పీసీఏ నుంచి బయటపడుతున్నాయి. బీవోబీ విషయంలో ఇదే జరిగింది. అయినప్పటికీ మెరుగైన పనితీరును చూపి పీసీఏ నిబంధనల నుంచి బయటకు వచ్చిన బీవోఐ వంటి బ్యాంకులను విలీనాల పేరుతో మరో బ్యాంకులో కలిపేయడం సరికాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: