త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాల‌ని భావించే వారి ఉత్త‌మ ఫ‌లితాల‌ను ఇచ్చే వెంట‌నే స్ఫూర‌ణ‌కు వ‌చ్చేది కిరాణా వ్యాపారం. త‌క్కువ పెట్టుబ‌డి, ఖ‌చ్చిత‌మైన ఫ‌లితాల‌కు కిరాణా దుకాణాల‌ను పేర్కొనవ‌చ్చు. అయితే,  ప్ర‌స్తుతం  ఒక కిరాణా స్టోర్‌ను ఏర్పాటు చేయాలంటే 28 అనుమతులు అవసరం అవుతున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి...దుకాణాలు-సంస్థల చట్టం లైసెన్సు, తూనికలు-కొలతలు దాకా ఎన్నో విభాగాల నుంచి మరెన్నో అనుమతులు పొందాల్సి వస్తున్నది. అలాగే ఓ దాబా, రెస్టారెంట్ ఏర్పాటుకు దాదాపు 17 అనుమతులను తీసుకోవాల్సి వస్తోంది. అగ్నిమాపక శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నుంచి పురపాలక శాఖ లైసెన్సుదాకా ఉండాల్సి ఉంది.


పైగా నగరానికో రకంగా అనుమతులుంటున్నాయి. దీంతో ఆశావహులు విసిగిపోయి.. చివరకు వ్యాపారం ఆలోచననే మానుకుంటున్నారు. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం ఈ అనుమతులపై ఘాటుగానే స్పందించింది. ఓ తుపాకీ కోసం 13 డాక్యుమెంట్లు అవసరమైతే.. ఓ సబ్‌వే రెస్టారెంట్ కోసం 24 కావా ల్సి వస్తోంద‌ని మండిప‌డింది. త‌మ నిబంధ‌న‌లు ఎందరో ఔత్సాహిక వ్యాపారుల సృష్టికి దెబ్బగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో టాప్-50పై గురిపెట్టిన భారత్‌కు.. ఈ అనుమతులు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అనుకుంటూ ప‌లు నిర్ణ‌యాలు తీసుకునేందుకు క‌దులుతోంది. నిజానికి చైనా, సింగపూర్ వంటి దేశాల్లో రెస్టారెంట్ కోసం కేవలం నాలుగు అనుమతులే అవసరం.


ఈ నేప‌థ్యంలో, కిరాణా దుకాణాలు, దాబా, రెస్టారెంట్ల ఏర్పాటును సులభతరం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వీటికున్న అనుమతుల చిట్టా చూసి ఆశావహులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో సులభతర వ్యాపార నిర్వహణలో భాగంగా అడ్డంకులన్నింటిని తొలగించాలని మోదీ సర్కారు భావిస్తోంది. అన్ని అనుమతులూ ఒకే దగ్గర నుంచి వచ్చేలా సింగిల్-విండో విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్ల మధ్య ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి పెను భారంగా పరిణమించిన ఈ అనుమతులను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ఇప్పుడు వ్యాపార వర్గాలకు కొంత ఊరటనిస్తోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: