ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రభుత్వానికి చులకన.  అదే ప్రయివేట్ సంస్థలైతే... దగ్గర పెట్టుకొని పాలుపోసి పెంచి పెద్ద చేస్తాయి.  కావాల్సినంత రుణాలు ఇస్తాయి.  తీరా వాళ్ళు హ్యాండ్ ఇచ్చి విదేశాలకు చెక్కేస్తే.. వాళ్ళను తిరిగి తీసుకురావడానికి.. మరో ఖర్చు.  ప్రైవేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడం వలన ఎంతటి నష్టమో తెలిసిందే కదా.  


కానీ ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రం రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంక్ ఎందుకు ముందుకు రాదో అర్ధంకావడం లేదు.  ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ టెలిఫోన్ సంస్థ బిఎస్ఎన్ఎల్ రుణాల భారంతో సతమతమౌతున్నది.  వందల కోట్ల అప్పులు ఉన్నాయి.  ఈ అప్పులు తీర్చి తిరిగి విజయంవైపు పయనించాలంటే... ఋణం కావాలి.  2500 కోట్ల రూపాయల టర్మ్ లోన్ కావాలని బ్యాంకులను కోరుతున్నది.  


అనుకూలమైన తిరిగి చెల్లింపు పద్ధతుల్లో రుణం పొందేందుకు చర్చలు కొనసాగుతున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ వార్తాపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఇది సజావుగా సాగితే కేంద్రం పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసే వరకు టెల్కో బతికి బట్టకడుతుంది. ఆ రుణం వస్తే కంపెనీ 'ఖర్చులు, జీతాలు, బిల్లుల చెల్లింపు, అమ్మకందారుల చెల్లింపులు' జరిపి మరో 6 నెలల పాటు మనుగడ సాగించగలదని ఒక అధికారి తెలిపారు. 

కానీ కంపెనీ భారీ పరిమాణం దృష్ట్యా రూ.2,500 కోట్లు చాలా తక్కువ మొత్తం అని నిపుణులు చెబుతున్నారు. ముందుగా బీఎస్ఎన్ఎల్ తన సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించుకోవాలని వారు సూచిస్తున్నారు. కంపెనీకి ఉన్న భూమి ఆస్తుల అమ్మకం అంత తేలికేం కాదని అంటున్నారు. భూమి అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని, రాష్ట్రాల్లో టెలిఫోన్ ఎక్స్ ఛేంజీలు పెట్టేందుకు వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయని గుర్తు చేస్తున్నారు. రుణాల చెల్లింపులు, జీతాలు ఇచ్చేందుకు జూన్ చివరి నాటికి రూ.850 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్ జీతాల చెల్లింపులో జాప్యం, భారీ సంఖ్యలో ఉద్యోగులు, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు లేకపోవడంతో కొండంత కష్టాలు ఎదుర్కొంటోంది. నిధుల కొరత ఎదుక్కొంటున్న కంపెనీకి పునరుద్ధరణ ప్రణాళిక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంతకు ముందు ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) లకు ఆర్థిక ఉద్దీపన ద్వారా ఊరటనిచ్చింది.

ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు పునరుద్ధరణ ప్యాకేజీలు ఇస్తానని హామీ ఇచ్చింది.పునరుద్ధరణ ప్యాకేజీ కింద కంపెనీకి అది కోరుతున్న 4జీ స్పెక్ట్రమ్ ఇవ్వవచ్చు. దాంతో పాటే 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను మార్కెట్ ధరలకు అందజేయవచ్చు. ప్రతిపాదిత ప్యాకేజీ కింద రూ.6,365 కోట్ల వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమ్ అమలు చేయడంతో పాటు 4జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు అవసరమైన రూ.6,767 కోట్లను వాటాల రూపంలో ఇవ్వనుంది.

భూ ఆస్తుల ముద్రీకరణ ద్వారా సంపాదించిన లీజ్ ఆదాయాన్ని 10 ఏళ్ల బాండ్లను తిరిగి చెల్లించేందుకు ఉపయోగిస్తారు. ఈ బాండ్లు వీఆర్ఎస్ కు నిధులు సమకూర్చనున్నాయి.టెలికాం రంగంలో రూ.6.1 లక్షల కోట్ల రుణాలు ఉండగా బీఎస్ఎన్ఎల్ కి రూ.13,500 కోట్ల అప్పులు ఉన్నాయి.

ఈ అప్పులు తీరి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ లాభాల బాటలో పయనించాలంటే.. ప్రయివేట్ టెలికాం సంస్థల లాగానే త్వరతగతిన ప్యాకేజీలు ప్రకటిస్తూ..వాటితో పోటీపడి ముందుకు సాగాలి.  అప్పుడే విజయం సాధించగలుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: