ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ విమనాశ్రయం నుంచి ప్రస్తుతం సింగపూర్‌ విమాన సర్వీసు నడుస్తుండగా కాలపరిమితి ముగియటంతో అవి రద్దయ్యింది. ఏళ్ల తరబడి గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూసిన కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల వాసుల చిరకాల కోరిక నెరవేరిందనే ముచ్చట తీరకుండానే.. ఆరు నెలలకే మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటి వరకు గన్నవరం నుంచి అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించి ఆరు నెలల ముచ్చటగానే మిగిలింది. ఇక్కడి నుంచి సింగపూర్‌కు ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దీగా నడుస్తున్నప్పటికీ అవి అర్ధంతరంగా ఆగిపోయాయి.

ఈ నెల 27న సింగపూర్‌కు నడిచిన విమాన సర్వీసే ఆఖరిది కావడం గమనార్హం.  ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో సంస్థకు సర్వీసులు ఆపేయాల్సిందిగా రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి శుక్రవారం ఆదేశాలు అందాయి. విమానాశ్రయ అధికారులకు సైతం ఇదే సమాచారం తాజాగా అందింది. దీంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒప్పందం చేసుకోవడం, లేదంటే.. ఏదైనా విమానయాన సంస్థ ముందుకొచ్చి ఎలాంటి ఒప్పందాలు లేకుండా నడిపితే తప్ప అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు అవకాశం ఉండదు.

రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో సంస్థతో కుదుర్చుకున్న లోటు భర్తీ నిధి(వీజీఎఫ్‌) విధానం జూన్‌తో ముగిసింది. దీంతో జూన్‌ 27 తర్వాత విమాన టిక్కెట్లను ఇండిగో నెల కిందటే ఆపేసింది. మళ్లీ మూడు రోజుల కిందట సింగపూర్‌కు సర్వీసులు నడపాలంటూ అధికారుల నుంచి ఇండిగో సంస్థకు ఆదేశాలు అందాయి. మరో ఆరు నెలలు వీజీఎఫ్‌ పద్ధతిలోనే గడువును పొడిగించనున్నట్లు చెప్పడంతో.. ఇండిగో టిక్కెట్ల విక్రయాన్ని.. జులై 9 నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది. వీటిని కొందరు ప్రయాణికులు ఈ మూడు రోజుల్లో బుక్‌ చేసుకున్నారు. అయితే.. తాజాగా విమాన సర్వీసులు ఆపేయాలంటూ.. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి అధికారిక సమాచారం అందింది.

దీంతో ఇప్పటి వరకూ విక్రయించిన టిక్కెట్ల ప్రయాణికులను.. ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసుకుంది. గన్నవరం నుంచి సర్వీసులను పూర్తిగా ఆపేసింది. దీంతో ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాల కథ.. మళ్లీ మొదటికే వచ్చింది. గన్నవరం నుంచి సింగపూర్‌ విమాన సర్వీసు నేరుగా ఉండడంతో కేవలం ఆరు గంటల్లో వెళ్లిపోయేవారు. ప్రస్తుతం సింగపూర్‌కు వెళ్లాలంటే.. ఒన్‌స్టాప్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాలకు వెళ్లి అక్కడి నుంచి సర్వీసులను అందుకుని వెళ్లాల్సిందే. దీనికి.. ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: