చుట్టూ భరించలేని పేదరికం. అక్కడే పుట్టి పెరుగుతాడు హీరో . పెద్దగా చదువుకోలేదు.. అనేక చిన్న చిన్న పనులు చేసి,ఒక్కసారి ధనవంతుడైపోతాడు.. సంపన్న హీరోయిన్‌ ని పెళ్లిచేసుకుంటాడు. హ్యాపీగా నవ్వుతున్న ఫ్యామ్లీ ఫొటో మీద శుభం కార్డ్‌ పడుతుంది..

సినిమా హాలు నుండి బయటకు వచ్చిన మనం ఆ కథను మర్చిపోతాం.. కానీ, ఆ కుర్రోడు మాత్రం ఆ సినిమా ను మర్చిపోలేదు..

పగలూ రాత్రి ఆ సినిమానే అతడిని వెంటాడింది.

ఆ హీరో లాగే ఎప్పటికైనా, గొప్పవాడైపోవాలని కలలు కన్నాడు, ఆ హీరో లాగే ఇంట్లోంచి పారిపోయి, ఆ హీరో లాగా బొంబాయి చేరాడు...

ఆ సినిమా నుండి జీవితం నేర్చుకున్నాడు.. అ సినిమా 1978 లో, అమితాబ్‌ హీరోగా నటించిన ' త్రిశూల్‌'.

చిల్లిగవ్వకు కొరగాని, అమితాబ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంపన్నుడిగా మారే స్టోరీ అది. దానికి ఇన్‌స్సయిర్‌ అయిన కుర్రోడే 17 సంవత్సరాల రాజా నాయక్‌ . అతడిది, కర్ణాటక లోని మారుమూల పల్లె , నిరుపేద దళిత కుటుంబం. ఐదుగురి సంతానంలో పెద్దవాడు.. ఈ బిడ్డలను పెంచలేక, అష్టకష్టాలు పడుతున్న రైతుకూలీ తల్లిదండ్రులు. ఆదాయం సరిపోక, ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకుంటూ రోజులను వెళ్లదీస్తున్న దుస్థితి.ఇలాంటి పేదరికం లో బతికే, రాజా ఒక రోజు చూసిన మూడు గంటల సినిమా అతడిని కదిలించింది.

పగలూ రాత్రి ఒకటే ఆలోచన.. హీరో లా గొప్పవాడిగా మారాలి... ఎలా..? ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బొంబాయి రైలెక్కాడు. ఎక్కడెక్కడో తిరిగాడు..కొంత అవగాహన పెంచుకున్నాడు. ఎలాగైనా డబ్బుసంపాదించాలన్న కసి తో ఇల్లు చేరాడు.

ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే లక్ష అవుతుందో కూడా, తెలియని రాజా నాయక్‌ నేటి టర్నోవర్‌ అక్షరాలా 65 కోట్లు. ఒకప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన యాభై రెండేళ్ల రాజా నాయక్‌ కి బెంజ్‌, స్కోడా, ఫోర్డ్‌ కార్లు ఉన్నాయి. బెంగళూరులో 3 అతిపెద్ద కమర్షియల్‌ కాంప్లెక్సులు అతని సొంతం. 250 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

నమ్మకం కలగడం లేదు కదా.. ఎలా సాధ్యమైంది.. ఇదంతా నిజమేనా..

ఏం చేసి ఈ స్ధాయికి ఎదిగాడు? అతని జీవన ప్రస్థానం ఏంటి..?

సామాన్యుడి అభిరుచే అతడి పెట్టుబడి...

బొంబాయి నుండి ఇల్లుచేరిన రాజా కు దీపక్‌ అనే పంజాబీ యువకుడు స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు.తల్లి వంట గది డబ్బాలో దాచిన రెండు వేలు ఇచ్చింది. అప్పుచేసి మొత్తానికి పదివేలు కూడగట్టారు.తమిళనాడులో ఒక బట్టల మిల్లుకు వెళ్లారు. ఎగుమతులు నిరాకరించిన టీ షర్టులను ఒక్కొక్కటీ యాభై రూపాయల కు కొని, బెంగళూరు ఫుట్‌ పాత్‌ల పై 100 రూపాయలకు అమ్మడం మొదలు పెట్టారు. ఒక్కరోజులో పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చింది. వ్యాపారంలోని మజా తెలిసింది.

అలా, ఎక్కడ ఏ వస్తువు చవకగా దొరికినా , ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుని, లోకల్‌ ఎక్సిబిషన్‌ ల లో అమ్మేవాళ్ళు. మిగిలిన సరుకును ఇద్దరూ, ఒక్కోవారం ఒక్కొక్క నగరం లో అమ్మేవాళ్ళు. కిలోల కొద్దీ బనియన్లు, టవళ్ళు , ఇన్నర్‌ వేర్‌... ఇలా ప్రతీ వస్తువు అమ్మారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. డబ్బు కూడబెట్టాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అనవసర ఖర్చుల జోలికి పోలేదు, వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టారు..వ్యాపారం మొదలుపెట్టి పదేళ్లు అయినా ఆఫీస్‌ పెట్టుకోలేదు.

పంజాబీలు, అగ్రకుల గుజరాతీ లు ఎక్కువగా చేపట్టే లాజిస్టిక్స్‌ రంగం లో పెట్టుబడి పెట్టారు. ప్యాకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. లక్షలు వస్తున్నా చాలా నిరాడంబరంగా , లో ప్రొఫైల్‌ లొనే వ్యాపారం చేశారు. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ లో పెట్టుబడులు, సులభతరమైన లైసెన్సుల విధానం పదేళ్ళ లో ఎదగడానికి మార్గం చూపించాయి అంటాడు రాజా. బాల్యం నుండీ తిన్న ,ఎన్నో ఎదురుదెబ్బలు, ఎంతో వివక్ష , మనసుకు తగిలిన గాయాలే ఇక్కడికి చేర్చాయంటారు.

తన చెల్లిని విద్యకు దూరం చేసిన వివక్ష గుర్తుకు వచ్చి, తన లాంటి వారికి చదువును చేరువ చేయాలనే సంకల్పం తో 'కళానికేతన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ' స్థాపించి పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. చిన్నగదితో ప్రారంభమైన స్కూల్‌ ఇప్పుడు నాలుగంతస్థుల భవనం. అక్కడ టీచర్‌ గా ఉద్యోగానికి వచ్చిన పేద ఆటో డ్రైవర్‌ కూతురు అనితను ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అతని సంస్థలకు అనిత ఇప్పుడు డైరెక్టర్‌ గా ఉన్నారు.వారికి ముగ్గురు కొడుకులు.

ముప్పై ఏళ్లపాటు చిందించిన స్వేదం ఇపుడు కళ్ళముందు అద్భుతమైన జీవితంగా కనిపించింది అంటాడు రాజా. అతను పేదరికంలో ఉన్నపుడు ఒకరికి నీళ్లు ఇస్తే, దళితుడని అతను ఇచ్చిన నీటిని తాగని ఒక సంఘటన నాయక్‌ ఇప్పటికీ మరువలేదు. 'జల్‌ ' డ్రాప్స్‌ పేరుతో వాటర్‌ బాట్లింగ్‌ యూనిట్‌ స్థాపించాడు. ఇప్పుడు రూ.9.50 కి దొరికే జల్‌ నీళ్ళ బాటిళ్ల షేర్‌ అతని టర్న్‌ ఓవర్‌ లో యాభై శాతం.

అసలు మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దాని కోసం కష్టపడితే, విజయం మీ గుమ్మం ముందు కూర్చుంటుంది ... అంటాడు రాజా. 

మరింత సమాచారం తెలుసుకోండి: