ఆన్‌లైన్‌ మార్కెట్‌లో, ఇంట్లోని చెత్తను కూడా సొమ్ము చేసుకునే మార్గాలు ఉన్నాయి! అంతేకాదు. ఎలాంటి చెత్తనైనా ఆన్‌లైన్‌ ద్వారా వదిలించుకోవచ్చని, కొన్ని స్టార్టప్‌ కంపెనీలు చెబుతున్నాయి. రీసైక్లింగ్‌ చేయడానికి అనువైన చెత్తనంతటినీ కస్టమర్ల ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తామని చెబుతున్న కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌ సైట్‌ల వివరాలు ఇవిగో..

పేటిఎం ద్వారా డబ్బులు చెల్లింపు...

ఢిల్లీకిచెందిన నీరజ్‌ గుప్తా, శైలేంద్ర సింగ్‌, ప్రశాంత్‌ కుమార్‌, శుభం షా అనే ముగ్గురు కలిసి జంక్‌ కార్ట్‌ను ప్రారంభించారు. ప్లాస్టిక్‌, అల్యూమినియం, ఐరన్‌, పేపర్‌, పుస్తకాలు, గ్లాస్‌ వంటి వాటిని సేకరిస్తారు. చెత్త ఇచ్చిన వారికి పేటిఎం వాలెట్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. మామాలుగా ఆన్‌లైన్‌లో ఒక వస్తువును కొనడానికి ఎలా ఆర్డరు ఇస్తామో అలానే జంక్‌ కార్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆర్డరు ఇస్తే వారే వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారి వెబ్‌సైట్లో ఏ చెత్తను ఎంతరేటుకు తీసుకుంటారో వివరాలు ఉన్నాయి. వెబ్‌సైట్‌:www.junkart.in

 మీ కర్మను మార్చే, రీసైక్లింగ్‌

చెడుగాని, కష్టాలుగాని ఎదురైనప్పుడు మన కర్మ ఇంతేలే అనుకుంటాం. ఈ కర్మ అనే సెంటిమెంట్‌ ఆధారంగా చెత్తను పారేసి మీరు మెరుగుపడండి అంటూ ఓ స్టార్టప్‌ చెబుతోంది. అదే కర్మ రీసైక్లింగ్‌. మనింట్లో పేరుకు పోయిన చెత్తను పారవేసి మన కర్మను మార్చుకోవచ్చు అనే థీమ్‌తో ఈ వెబ్‌ సైట్‌ వారు చెత్తను సేకరిస్తున్నారు. అయితే వీరు మామూలు చెత్తను కాకుండా, పాత మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు సేకరిస్తారు. వాటిలో ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ వాటిని చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. ఇలా దాదాపు 3 వేల స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను వీరు రీసైక్లింగ్‌కు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో కర్మసేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌:www.karmarecycling.in 

 చెత్త సేకరణకు యాప్‌

అనురాగ్‌ అస్తీ, కవీంద్ర రఘువంశీ అనే ఇద్దరు కలిసి కబాడీవాలా ను ప్రారంభించారు. వీరు తమ యాప్‌ ద్వారా స్థానికంగా ఉన్న ఇళ్లనుంచి న్యూస్‌ పేపర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, లోహ వస్తువులు, పుస్తకాలు, ఇనుము వంటి వాటిని ఇంటి యజమానులకు కొంత మొత్తంలో డబ్బులచెల్లించి తీసుకుంటారు. ఈ చెత్త కార్యక్రమం వల్ల.. 10వేల చెట్లను రక్షించబడడమేగాక, 2.5 లక్షల లీటర్ల ఆయిల్‌, 13.8 మిలియన్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. వెబ్‌సైట్‌:www.thekabadiwala.com


మరింత సమాచారం తెలుసుకోండి: