టెలికం రంగంలో మరో సంక్షోభం తలెత్త‌నుంది. రిల‌యెన్స్‌ జియో దెబ్బకు ఇప్పటికే చాలా టెలికాం సంస్థలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి. యూనినార్, వోడాఫోన్ లాంటి సంస్థలు విలీనం అయిపోయాయి. ఇక ఇప్పుడు దేశీయ మార్కెట్లో ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిర్టెల్ కు సైతం జియో దెబ్బ తగిలింది. రిలయన్స్ జియో మార్కెట్లో వరుస పెట్టి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ దూసుకుపోవడంతో ఎయిర్టెల్ పై ఆ ప్ర‌భావం తీవ్రంగా చూపించింది. దీంతో ఎయిర్టెల్ కూడా నష్టాల బాటలో పయనిస్తోంది.


టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.97.30 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ తాజాగా రూ.2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.362.10 అసాధారణ నష్టాన్ని చవిచూసింది.


దీనిని బ‌ట్టి జియో ప్ర‌భావంతో దేశీయ మార్కెట్లో ఎయిర్‌టెల్ ఎలా ప‌ట్టు కోల్పోతుందో స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే, అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆదాయం 4.59 శాతం పెరిగి రూ.20,812.50 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ.19,898 కోట్లుగా ఉంది. ఇక ఈ యేడాది జూన్ 30 నాటికి దేశ‌వ్యాప్తంగా భార‌తీ ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల సంఖ్య 40.37 కోట్లుగా ఉంది.


గతేడాది ఇదే సమయంలో 45.66 కోట్ల మంది ఖాతాదారులున్నారు. జూన్ మాసాంతానికి 10.9 మంది ఖాతాదారులను కోల్పోయింది. అంటే యేడాదిలోనే సుమారు 5 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఎయిర్‌టెల్ కోల్పోవాల్సి వ‌చ్చింది. అటు ఎయిర్‌టెల్ షేర్ వేల్యూ కూడా అంతంత మ‌త్రంగానే ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జియో జోరు చూస్తుంటే ఎయిర్‌టెల్ మ‌రింత న‌ష్టాల‌ను చ‌విచూడ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: