చిత్తూరు జిల్లా, సత్యవేడు, శ్రీసిటీలోని ఆల్స్టోమ్‌ పరిశ్రమ నుంచి 100వ మేక్‌-ఇన్‌-ఇండియా మెట్రో ట్రైన్‌ సెట్‌ సోమవారం(ఆగష్టు 05, 2019) విడుదలైంది.
ఈ 100వ ట్రైన్‌ సెట్‌ కొచ్చి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు వెళుతుండగా, మరోవైపు కె ఎం ఆర్‌ సి ఎల్‌ ఆర్డరుకు సంబంధించి ఇది చివరి 25వ మెట్రో ట్రైన్‌ సెట్‌ కావడం విశేషం.


ఈ సందర్భంగా, శ్రీసిటీ సెజ్‌లోని ఆల్స్టోమ్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆల్స్టోమ్‌ ఇండియా మరియు సౌత్‌ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలైన్‌ స్పోర్‌, కొచ్చి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారులు రాజేంద్రన్‌, సిన్హా తదితరులు లాంఛనంగా జెండా ఊపి మెట్రో ట్రైన్‌ సెట్‌ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అలైన్‌ స్పోర్‌ మీడియాతో మాట్లాడుతూ, తమ శ్రీసిటీ ప్లాంట్‌ నుంచి 100 వ ట్రైన్‌ సెట్‌ విడుదల చేయడం ద్వారా ఒక సెంచురీ కొట్టామన్నారు. ఈ మైలు రాయి మా సామర్ధ్యాలకు, వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకానికి అద్దం పడుతోందన్నారు.


భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో మాకున్న 4200 సభ్యుల సమష్టి సహకారంతో ఇది సాధ్యపడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్‌-ఇన్‌-ఇండియా ఆశయాలకు అనువుగా స్వదేశంలోనే ,తెలుగు నేల పై అంతర్జాతీయ స్ధాయి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు ఆయని వివరించారు. 600 మందికి ఉపాధి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఆల్స్టోమ్‌ మొదటి గ్లోబల్‌ ఉత్పత్తి కేంద్రం (మ్యానుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ ఫర్‌ రోలింగ్‌ స్టాక్‌) శ్రీసిటీలో 2013 లో, నెలకొల్పబడింది. 2014 ఫిబ్రవరిలో మొదటి మెట్రో ట్రైన్‌ సెట్‌ ను చెన్నై మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కు అందించింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి గరిష్టంగా 240 ట్రైన్‌ కార్లు (బోగీలు) తయారీ సామర్త్యం కలిగివుంది. భవిష్యత్తులో దీని ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది. ఇప్పటివరకు శ్రీసిటీ-ఆల్స్టోమ్‌ ప్లాంట్‌ నుంచి దేశీయ, అంతర్జాతీయ వినియోగదారులకు 420 మెట్రో ట్రైన్‌ కార్లను నిర్ణీత వేళలలో సరఫరా చేశారు.


ఇందులో కొచ్చి, చెన్నై, లక్నో మెట్రోలతో పాటు, సిడ్నీ (అంతర్జాతీయ వినియోగదారు) మెట్రోలు వున్నాయి. శ్రీసిటీ ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించిన కేవలం ఆరు సంవత్సారాలలో మ్యానుఫ్యాక్చరింగ్‌ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్న ఆల్స్టోమ్‌, దేశీయ మరియు అంతర్జాతీయ క్లయింట్లకు ఒక హబ్‌ గా మారింది. 75 శాతం దేశీయ సప్లై చైన్‌ ఆధారంగా పనిచేస్తోంది. స్థానిక ఉద్యోగావకాశాలను పెంపొందించడంతో పాటు 10 శాతం మహిళా ఉద్యోగులు సూపరవైసర్లు, ప్లానర్లు, ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి, ముంబై మెట్రో లైన్‌ 3 కు 248 మెట్రో కార్లు, మాంట్రియార్‌ మెట్రోకు 212 మెట్రో కార్లు, చెన్నై మెట్రోకు మరో 10 ట్రైన్‌ సెట్లు తయారీని, ఇప్పటికే ప్రారంభించారు.

ఫొటో ... జెండా ఊపి మెట్రో ట్రైన్‌ సెట్‌ ను విడుదల చేస్తున్న ఆల్స్టోమ్‌ ఇండియా ఎండీ, కె ఎం ఆర్‌ సి ఎల్‌ ఉన్నతాధికారులు 


మరింత సమాచారం తెలుసుకోండి: