నల్లమల, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల అంశం మరోసారి అలజడి రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న గిరిజనుల్లో ఆందోళన కల్గిస్తోంది. యురేనియం తవ్వకాలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చాయని తెలియగానే మరో పోరాటానికి సిద్దమవుతున్నారు. స్థానికులు, గిరిజనులకు కాంగ్రెస్‌తో పాటుగా వామపక్షాలు అండగా నిలిచి.. పోరాటం చేసేందుకు వ్యూహారచన చేస్తున్నాయి. యురేనియం తవ్వకాలు చేపడితే.. ఊరుకునేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. 


అసలే ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న నల్లగొండ జిల్లాలో యురేనియం తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణ పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లోని పెద్దగట్టు  కేంద్రంగా యురేనియం తవ్వకాలకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కేంద్రం మరో అడుగు‌ముందుకు వేసి పర్యావరణ అనుమతులు  కూడా ఇచ్చింది. నల్లగొండ జిల్లాలో కృష్ణ పట్టే పాంత్రంలోని నాగార్జున సాగర్, దేవరకొండ డివిజన్ పరిధిలో యురేనియం తవ్వకాలను ఈ ఏడాది చివర్లో గానీ లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించనున్నారు. 


నేషనల్ న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ అవసరాల‌ కోసం యురేనియం నిల్వలను వెలికి తీయాలని నిర్ణయించారు. ఇప్పటికే రహస్యంగా భూ సేకరణ ప్రక్రియ మొదలైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దాదాపు ఏడేళ్లపాటు తవ్వకాలు జరుగుతాయని అంచనా. అయితే యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు యురేనియం తవ్వకాలను అడ్డుకున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు.. అధికారంలోకి వచ్చాక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సీపీఎం నేతలు. 2003లో దేవరకొండలో యురేనియం తవ్వకాలను అడ్డుకున్నారు స్థానికులు, గిరిజనులు. ఇపుడు కూడా అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. యూరేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో వామపక్షాలు కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. యురేనియం తవ్వకాలు ఆపాలని ప్రధానికి లేఖ రాస్తానన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 


నాగార్జున సాగర్ ‌ప్రాజెక్ట్‌ నిర్మాణం సమయంలోనే తాము సర్వం కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ తవ్వకాల పేరుతో నిలువ నీడ లేకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు ఇక్కడి గిరిజనులు, స్థానికులు. మూడు రోజుల క్రితం నీటి నమూనాల సేకరణ కోసం వచ్చిన అధికారులను పెద్దగట్టు గ్రామస్తులు అడ్డుకున్నారు. అసలే ఉమ్మడి నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్‌ భూతం వెంటాడుతోంది. ఈ సమయంలో యురేనియం తవ్వకాలు చేపడితే.. యురేనియం నిక్షేపాలు.. నాగార్జున సాగర్‌లోని కృష్ణా జలాలతో కలిసి కలుషితం అవుతాయని, అప్పుడు జీవుల మనుగడ కూడా కష్టమవుతుందని విద్యావంతులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 







మరింత సమాచారం తెలుసుకోండి: