మూడేళ్ళ క్రితం వరకు మనం వాడే మొబైల్ ఇంటర్నెట్ ధరలు, ఇప్పుడు వాడుతున్న నెట్ ధరలతో పోలిస్తే ఏకంగా రెండు వందల రేట్లు ఉండేవని, అయితే ఆ సమయంలో రిలయన్స్ జియో రాకతో ఒక్కసారిగా ఇంటర్నెట్ టారిఫ్ రేట్లు మెల్లగా తగ్గుతూ, ప్రస్తుతం సామాన్యుడికి సైతం ఎంతో అందుబాటు ధరల్లోకి ఇంటర్నెట్ టారిఫ్ రావడం జరిగిందనే విషయం మనకు తెలిసిందే. అయితే జియో విప్లవం అంతటితో ఆగలేదు, అక్కడిను మెల్లగా డిటిహెచ్, బ్రాడ్ బ్యాండ్, వాయిస్ కాలింగ్ వంటివి కూడా వినియోగదారుడికి మరింత తక్కువ రేటుకి అందించాలనే తపనతో అప్పటినుండి ఇప్పటివరకు దానికి సంబందించిన కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగింది. ఇక ఇటీవల జరిగిన తమ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో జియో గిగా ఫైబర్ ను మరియు వాటి టారిఫ్ రేట్లను వినియోగదారుడి ముందు ప్రవేశ పెట్టి, మిగతా ఆపరేటర్లకు పెద్ద షాక్ ని ఇచ్చింది జియో. 

ఇకపోతే మరొక పదిరోజుల్లో మన దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో జియో గిగా ఫైబర్ సేవలు అధికారికంగా అందుబాటులోకి వస్తుండడంతో, అప్పుడే ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్  తో పాటు, పలు ప్రైవేట్ ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలయ్యాయి. ముఖ్యంగా కేవలం అతి తక్కువ ధరలకే ఒకేసారి బ్రాడ్ బ్యాండ్, డిటిహెచ్, వాయిస్ కాలింగ్ వంటి సౌకర్యాలు అందిస్తుండడంతో, ఇప్పటికిపుడు కాకపోయినా మెల్లగా చాలావరకు పేద మరియు మధ్యతరగతి ప్రజలు జియో వైపు చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు టెక్ నిపుణులు. ఇక జియో రాకతో యాక్ట్, ఎయిర్టెల్, హత్వయ్ వంటి ప్రైవేట్ బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లు, అప్పుడే కస్టమర్లకు ఇప్పటివరకు తాము అందిస్తున్న ప్లాన్స్ లో చాలావరకు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక మరోవైపు ప్రైవేట్ డిటిహెచ్ సంస్థలు కూడా ఇప్పటివరకు ఇస్తున్న ఛానల్స్ టారిఫ్ లో మార్పులు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయట. ఎటొచ్చి చూస్తే, జియో దెబ్బ చాలావరకు ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ పై కూడా కొంతవరకు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కొన్నేళ్లుగా ల్యాండ్ లైన్ మరియు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు బాగా తగ్గుముఖం పట్టడంతో, కొద్దిరోజులుగా మళ్ళి కస్టమర్లను ఆకర్షించే విధంగా ఫైబర్ నెట్, 

ఫ్రీ కాలింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి, ఒకింత మెల్లగా పుంజుకుంటున్న ఈ తరుణంలో, జియో గిగా ఫైబర్ ఇచ్చిన ఈ అతిపెద్ద షాక్ తో ఆ సంస్థలో కూడా కొంత గుబులు మొదలయిందట. అయితే ప్రస్తుతం రాబోతున్న జియో గిగా ఫైనార్ వలన పెద్ద సంస్థలైన బిఎస్ఎన్ఎల్, యాక్ట్, ఎయిర్టెల్ వంటి వాటికి ఇప్పటికిపుడు  పెద్దగా నష్టమేమి వాటిల్లే అవకాశం లేదని, అయితే పూర్తి స్థాయిలో జియో రంగ ప్రవేశం చేసిన తరువాత, దేశంలోని ఏ ఏ ప్రాంతాల్లో దాని సామర్థ్యం ఎలా ఉంది అనేది కొద్దిరోజుల్లోనే అందరికి తేటతెల్లం అవుతుంది కనుక, దానిని బట్టే మిగతా ఆపరేటర్లపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చెప్పగలం అంటున్నారు నిపుణులు. కాకపోతే జియో ధాటికి అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న చిన్న ప్రైవేట్ బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లకు మాత్రం ఇది పెద్ద ముప్పేనని, దాని రాకతో అతి కొద్దిరోజుల్లో వాటిలో చాలావరకు మూతపడే అవకాశం లేకపోలేదని కూడా వారు అంటున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: