ఆర్ధిక సంక్షోభ ఛాయలు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పై కూడా పడనుందా? లక్షలు పెట్టి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ప్రజలు తటపటాయిస్తున్నారా? జాగ్రత్త పడకపోతే కమర్షియల్‌ స్పేస్‌ రంగం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందా? హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూస్తుంటే.. ఔననే సమాధానం వస్తోంది.  


ప్రపంచంలోని అతి పెద్ద ఆర్ధిక మార్కెట్‌లలో ఒకటిగా పరిగణించే భారతదేశం ఆర్ధిక సంక్షోభం ముంగిట నిలబడి ఉంది. ఆటోమొబైల్‌ రంగం ఇప్పటికే కుదుపులను చూస్తోంది. దీని ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నష్టాలను చవి చూస్తోంది. మార్కెట్‌లో నగదు చలామణి తగ్గిపోవటం, పెరుగుతున్న నిరుద్యోగం వల్ల లక్షలు పెట్టి ఇల్లు కొనటానికి వినియోగదారులు ముందుకు రావటం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 12.76 లక్షల వరకు ఫ్లాట్‌లు అమ్మకాలు లేక మగ్గుతున్నాయని రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని సంస్థలు చేసిన సర్వేలో తేలింది. వీటిలో ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌  లాంటి 8 నగరాల్లోనే తొమ్మిదిన్నర లక్షలకు పైగా అమ్ముడుపోని ఫ్లాట్ ఉన్నాయి.  


వాస్తవానికి  హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ రంగం మూడు నాలుగేళ్ళ నుంచి బాగానే పుంజుకుంటోంది. అంతకుముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆందోళనలు, రాష్ట్ర విభజన, తర్వాతి పరిణామాలతో వినియోగదారుల్లో నిర్లిప్తత వల్ల దాదాపు  ఎనిమిదేళ్ల  ఏళ్ల పాటు హైదరాబాద్‌ రియాల్టీ నష్టాలను చవి చూసింది. అయితే తాజా ఆర్థిక సంక్షోభ ఛాయలు మరీ అంత వెనక్కి తీసుకువెళ్ళకపోయినా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. 2లక్షల 12వేల ఎస్‌ఎఫ్‌టీలకు పైగా నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. అనుమతులు జారీ చేయాల్సిన స్టేట్‌ లెవెల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌మెంట్‌ అథారిటీ, స్టేట్‌ ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటి గడువు గత ఏడాది ఏప్రిల్ లోనే ముగిసింది. ఎన్నికలు, ఇతర కారణాలతో కొత్త కమిటీల ఏర్పాటు ఏడాదికి పైగా ఆలస్యం అయింది. దీని వల్ల దాదాపు 300 వరకు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు అనుమతుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి . దీని వల్ల కూడా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో తగ్గుదల ఏర్పడింది. ఈ మధ్యనే కొత్త బోర్డులు ఏర్పాటు అయ్యాయి. పెండింగ్‌ రియల్‌ ఎస్టేస్ట్ ప్రాజెక్టులకు అనుమతులు వస్తే ఏకకాలంలో పెద్ద మొత్తంలో నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. ఇక కమర్షియల్‌ స్పేస్‌ విషయానికి వస్తే భవిష్యత్తులో డిమాండ్‌ను మించి సప్లయ్‌ పెరిగే అవకాశాలున్నాయి. 


ఉన్నపళంగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు ఎక్కువ ఇబ్బంది లేకపోయినా... పూర్తి చేయటానికి ఐదు ఆరేళ్ళకు పైగా పట్టే భారీ స్కైక్రాపర్స్‌ నిర్మాణం వైపు బిల్డర్స్‌ వెళ్లకపోవడమే మంచిదంటున్నారు మార్కెట్ నిపుణులు.  బ్యాంకింగ్‌, పరిశ్రమలతో పాటు ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పు వచ్చినా రియల్‌ ఎస్టేట్‌ పై దాని ప్రభావం పడే అవకాశం ఉండటంతో దేశంలో నెలకొన్న పరిస్థితులను బిల్డర్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు దగ్గరగా పరిశీలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై లాంటి ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుందనే ఆశాభావం వీరిలో కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: