హైదరాబాద్‌ రియాల్టీ మార్కెట్‌ను యువత ఏలుతోంది. చిన్న బడ్జెట్‌ ఫ్లాట్ల కొనుగోళ్ళల్లో సగం వాటా వీరిదే. పెళ్ళికి ముందే ఫ్లాట్‌ కాన్సెప్ట్‌తో ముందుకు వెళుతోంది సిటీ యూత్‌.  గతంలో ఇల్లు కొనటం పెద్దవాళ్ళ వ్యవహారంగా ఉండేది. ఓ ముప్పై ఏళ్ళపాటు ఉద్యోగం చేసి రిటైర్‌ అయిన తర్వాత వచ్చే డబ్బులతో ఇల్లు కొనేవారు. దీని కంటే ముందు పిల్లల చదువులు, ఉద్యోగాలు, వారి పెళ్ళి బాధ్యతలు నెరవేర్చటం కూడా జరిగిపోయేది. అంత వరకు అద్దె ఇళ్ళల్లోనే జీవితం అంతా గడిచిపోయేది. లేదా వారసత్వంగా ఇల్లు వచ్చి ఉంటే...దాంట్లోనే నెట్టుకు వచ్చేసే వారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది. ఉద్యోగం వచ్చీ రాగానే మనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఆలోచిస్తోంది యూత్‌. పెళ్లికి కంగారు పడటం లేదు కానీ సొంత ఇంటి కల నెరవేర్చుకోవటానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో 35-40 లక్షల బడ్జెట్‌ గృహాల కొనుగోళ్ళల్లో 50 శాతానికి పైగా వాటా వీరిదే. శాలరీ ప్యాకేజ్‌ని బట్టి కొంత మంది 50లక్షలు, ఆ పై బడిన ఫ్లాట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌, ఆ తర్వాత క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోతున్నాయి. దీంతో పాతికేళ్ళ రాకముందే ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్నారు.  


సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి జీతాలు ఉండటంతో తమదైన అభిరుచితో సొంత ఇంటి కోసం వేట మొదలుపెడుతున్నారు. కొంత మంది పెళ్ళికి ముందే ఫ్లాట్‌ కొనుగోలు చేస్తుంటే...కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత ప్లాన్‌ చేసుకుంటున్నారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు అందించే ఆర్ధిక సహకారం, ఇద్దరి జీతాలతో పెరిగే బడ్జెట్‌ వల్ల ఇంటి కొనుగోలు ఇబ్బందికరం కావటం లేదు. యువత నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని బిల్డర్స్‌ కూడా వీరి అభిరుచులకు, అవసరాలకు తగినట్లు వెంచర్స్‌ వేస్తున్నారు. 


ఉద్యోగం, ఆ వెంటనే సొంత ఇల్లు కొనుగోలు చేయటం వెనుక కారణాలు లేకపోలేదు. ప్రధానంగా ఇంటి కొనుగోలు కోసం హోమ్‌ లోన్‌ పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు. జీతం అంతా జల్సా ఖర్చు చేయకుండా ఆర్ధిక క్రమశిక్షణ అలవాటు పడుతుంది. తమ కంపెనీ తరపున విదేశీల్లో పని చేస్తే అదనపు ఆదాయం వస్తుంది. అది డౌన్‌ పేమెంట్‌ కింద పనికి వస్తుంది లేదా పెళ్లి జరిగితే పెద్ద వాళ్లు కొంత జంటకు ఆర్ధిక సహకారం అందిస్తారు. ఇలా వచ్చే డబ్బును వృధా చేయకుండా ఆస్థి కొనుగోలు చేసినట్టు అవుతుంది. అద్దెకు బదులు అదే డబ్బు రుణ వాయిదాలకు మళ్లిస్తే కొన్నేళ్ళ తర్వాత ఇల్లు సొంతమవుతుంది. పైగా హైదరాబాద్‌లో ఆస్థి వెలువ పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో అమ్ముకోవాలనుకున్నా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభం వస్తుంది. ఈ కారణాలతో 25-35 ఏళ్ళ యువత ఇల్లు కొంటున్నారని అంటున్నారు బిల్డర్స్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: