10 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేస్తూ  4 పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలాసీతారామన్ ఇటీవల  ప్రకటించిన విషయం తెల్సిందే . అదే సమయం లో  ప్రాంతీయ అస్తిత్వ భావాలకు అనుగుణంగా  ఉత్తరాన పంజాబ్ సింధ్ బ్యాంకు, పశ్చిమాన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తూర్పున యూకో బ్యాంకు మరియు దక్షిణాన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ల అస్తిత్వం యధావిధిగా కొనసాగుతుందని  ఆమె  చెప్పారు.అయితే ఆంధ్రాబ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో  విలీనాన్ని తెలుగువారు ఎలా చూడాలన్న దాన్ని మాత్రం నిర్మలాసీతారామన్ నిర్వచించలేదు . ఆంధ్రాబ్యాంక్ మరి తెలుగువారి అస్తిత్వం కాదా? అన్న ప్రశ్న కు సమాధానం కరువవుతోంది .  


తెలుగు ప్రాంత ప్రజలకు  పొదుపు చేసుకునే వసతి, వ్యవసాయ, వ్యాపార రంగాలకు ఋణ సౌకర్యాలు కల్పించే సదుద్దేశంతో  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కీ. శే. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య , 1923లో  మచిలీపట్నం (బందరు) ముఖ్య వేదికగా ఆంధ్రా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించారు . ఆ తర్వాత ప్రధాన కార్యాలయం హైదరాబాద్ కు తరలించారు .  ప్రస్తుతం  దేశవ్యాప్తంగా అనేక రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆంధ్రా బ్యాంకు... 2023 లో తన 100 సంవత్సరాల  పూర్తి చేసుకుని  శతాబ్ది ఉత్సవాలు  జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్న తరుణం లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలుగువారికి శరాఘాతంగా మారింది .


ఆంధ్రా బ్యాంకు ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం పేరుతో " ఆంధ్రా బ్యాంకు " అస్తిత్వం లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని పలువురు కోరుతున్నారు . 96 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా అంకిత భావంతో విశేష సేవలు అందించడమే కాకుండా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి   బ్యాంకర్ల కమిటీ కి కన్వీనర్ గా వ్యవహరించి తెలుగు వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆంధ్రా బ్యాంకు అస్తిత్వం లేకుండా చేయడమంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆత్మగౌరవాన్ని  దెబ్బ తీయడమే అవుతుందని అంటున్నారు  . . 

మరింత సమాచారం తెలుసుకోండి: