మూడేళ్ల క్రితం టెలికాం రంగంలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి, మొబైల్ ఇంటర్నెట్ ధరలను సామాన్యుడికి సైతం ఎంతో చేరువ చేసిన రిలయన్స్ జియో సంస్థ, అనతి కాలంలోనే కోట్లాదిగా సబ్ స్క్రైబర్స్ ను తమ వైపుకు తిప్పుకుంది. అయితే అదే సమయంలో రాబోయే మరికొద్ది కాలంలో తమ నుండి అత్యధిక స్పీడ్ కలిగిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు కూడా అంబాటులోకి రానున్నట్లు తెల్పింది జియో సంస్థ. ఇక అప్పట్లో తాము చెప్పినట్లుగా, త్వరలో ప్రవేశపెట్టబోయే జియో గిగా ఫైబర్ సేవలను గురించి, గత నెలలో తమ ఎజిఎం లో అధికారిక ప్రకటన చేసారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. రూ.700 మొదలుకుని రూ.10,000 వరకు గిగా ఫైబర్ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని, అలానే ముఖ్యంగా నేటి కాలంలో సామాన్యుడు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా విడివిడిగా డబ్బులు చెల్లించవస్తోందని భావించి, తాము ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ లో ఈ మూడు సర్వీసులను అతి తక్కువ ధరకే కస్టమర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. 

అంతేకాక తాము ప్రకటించబోయే ప్లాన్స్ లో ఏడాది మొత్తం అంటే, యాన్యువల్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి 4కె టెక్నాలజీ గల స్మార్ట్ డిజిటల్ టివి ని కూడా ఫ్రీ గా అందించబోతున్నట్లు సంచలన ప్రకటన వెలువరించింది. ఇక తమ పూర్తి టారిఫ్ ప్లాన్లు సెప్టెంబర్ 5 నుండి అందుబాటులోకి రావడం జరుగుతుందని, అదే రోజున పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆరోజు ఎట్టకేలకు రావడంతో, నేడు కోట్లాది మంది ప్రజలు జియో గిగా ఫైబర్ నుండి ఎటువంటి ప్లన్స్ వస్తాయా, ఎంత త్వరగా ఆ సర్వీస్ తీసుకుందామా అని ఆశగా ఎదురుచూడసాగారు. ఇక కాసేపటి క్రితం తమ గిగా ఫైబర్ ప్లాన్స్ ని జియో వెల్లడించడం జరిగింది. అయితే ఈ ప్లాన్స్ గురించి తెలుసుకున్న చాలా మంది కస్టమర్లు, వీటిపై పెదవి విరుస్తూ, తమ ఆశలపై జియో నీళ్లు చల్లింది అంటూ వాపోతున్నారు. ఇక జియో ప్రవేశపెట్టిన ప్లాన్స్ లో రూ.699 (బ్రాంజ్), రూ. 849 (సిల్వర్), రూ. 1299 (గోల్డ్), రూ. 2499 (డైమండ్), రూ. 3999 (ప్లాటినం), రూ. 8499 (టైటానియం) పేర్లతో అందుబాటులోకి తెచ్చింది. 

అయితే అందులో ముందుగా బ్రాంజ్ ప్లాన్లో 100 ఎంబిపిఎస్ స్పీడ్ తో 150 జిబి డేటా (100+50), అలానే సిల్వర్ ప్లాన్లో 100 ఎంబిపిఎస్ స్పీడ్ తో 400 జిబి డేటా (200+200), గోల్డ్ ప్లాన్లో 250 ఎంబిపిఎస్ స్పీడ్ తో 750 జిబి డేటా (500+250) , డైమండ్ ప్లాన్లో 500 ఎంబిపిఎస్ స్పీడ్ తో 1500 జిబి డేటా (1250+250), ప్లాటినం ప్లాన్లో 1 జిబిపిఎస్ స్పీడ్ తో అన్లిమిటెడ్ (2500) జిబి డేటా, అలానే టైటానియం ప్లాన్లో 1 జిబిపిఎస్ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా (5000) జిబి వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో పోస్ట్ ఎఫ్యుపి, అంటే ప్లాన్ ప్రకారం కేటాయించిన జిబి అయిపోయినా తరువాత, లభించే స్పీడ్ 1 ఎంబిపిఎస్ మాత్రమే నని కంపెనీ తెల్పింది. అలానే అడిషినల్ గా ఇచ్చిన డేటా కేవలం ఆరునెలల వరకేనని ప్లాన్ పట్టికలో జియో తెల్పింది. ఇక ఈ ప్లాన్స్ ప్రకారం వినియోగదారులకు జియో బ్రాడ్ బ్యాండ్ బాక్సు తోపాటుగా డిజిటల్ సెట్ టాప్ బాక్సును కూడా అందించడం జరుగుతుంది. ఇక ఆ బ్రాడ్ బ్యాండ్ బాక్సుకు అనుసంధానించి పిన్ ద్వారా గల సాకెట్లలో ఒక సాకెట్, ఫ్రీ టెలిఫోన్ వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానిని టెలిఫోనిక్ వైర్ తో అనుసంధానించి, ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు, లేదా జియో కాలింగ్ యాప్ ద్వారా కూడా కాల్స్ చేసుకోవచ్చు. ఇక ప్రకటించిన దీర్ఘకాలిక్‌ ప్లాన్స్‌ లో వినియోగదారులకు 3, 6, 12 నెలల ప్లాన్లను కూడా ఎన్నుకోవచ్చు. 

ఇందుకు ఈఎంఐ సౌకర్యం కూడా లభించనుంది. ఇందుకు జియో సంస్థ బ్యాంక్‌లతో టై ఆప్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక  జియో ఫైబర్‌ వెల్‌కమింగ్‌ ఆఫర్‌ క్రింద ప్రతీ వినియోగదారుడికి అమూల్యమైన సేవలు అందించనుంది. ఆ వార్షిక ప్లాన్‌ ప్రకారం, జియో హోమ్ గేట్‌వే, జియో 4కే సెట్ టాప్ బాక్స్, టెలివిజన్ సెట్ (గోల్డ్‌ ప్లాన్‌ ఆ పైన వారికి మాత్రమే), అలానే మీకు ఇష్టమైన  ఓటీటీ అనువర్తనాలకు (హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్) వంటివి, అపరిమిత వాయిస్ , డేటా సేవలు తదితర ప్రయోజనాలు అందులో ఉంటాయి. అయితే జియో ప్రకటించిన ఈ ప్లాన్స్ ప్రకారం చూస్తే, ఇవి ఎక్కువగా పై తరగతి వారికే లాభాన్ని చేకూరుస్తాయి అంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే, జియో ప్రకటించిన బేసిక్ ప్లాన్ లో కేవలం 150 జిబి డేటా ఇవ్వడం, అందులోనూ అడిషినల్ గా ఇచ్చిన డేటా కూడా కేవలం ఆరు నెలలవరకే, అంటే ఏడవ నెల నుండి మనకు లభించేది 100 జిబి మాత్రమే అని అంటున్నారు. అలానే 4కె స్మార్ట్ టివి ధరలు కూడా తడిసి మోపెడు అవుతుండడంతో, జియో ప్రకటించిన ఈ ప్లాన్స్ మధ్యతరగతి వారికి పెద్దగా సంతృప్తి కలిగించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: