సాధారణంగా ఎక్కడైనా మొదటి ర్యాంకు ఒకసారి తెచ్చుకోవటం పెద్దగా కష్టమైన విషయమేమీ కాదు. కానీ అదే మొదటి ర్యాంకును కొనసాగిస్తూ ఉండటం మాత్రం చాలా కష్టమైన విషయం. అలా అగ్ర స్థానానికి చేరి అగ్ర స్థానంలోనే కొనసాగుతున్న ఒక బ్యాంకు కథే ఇది. భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గడచిన 25 సంవత్సరాల నుండి అగ్రాగామిగా అంచనాలకు మించి రాణిస్తూ ఉండటం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ పరంగా ప్రస్తుతం మిగతా బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ స్థాయిలో ఉంది. 
 
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో చాలా బ్యాంకులు ప్రస్తుతం వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం మిగతా బ్యాంకులతో పోలిస్తే ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించటంలోను, ఆస్తుల నాణ్యతలోను మెరుగ్గా కనిపిస్తోంది. ఆర్థిక ఫలితాల వృధ్ధిలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండటం విశేషం. సమస్యలను వేగంగా పరిష్కరించటం కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ స్థానానికి చేరుకోవటానికి కారణమైంది. 
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మెరుగైన పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రయాణం చేస్తోంది. ఇతర బ్యాంకులకు ఏ మాత్రం సాధ్యం కాని లాభాలను తన ఖాతాల్లో చూపించగలుగుతోంది. దీర్ఘకాలికంగా ఎంచుకున్న వ్యూహాల ఫలితంగానే హెచ్‌డీఎఫ్‌సీ అగ్రస్థానానికి చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వ్యవస్థాపక ఎండీ అదిత్య పురి పర్యవేక్షణలో కొనసాగుతోంది. నష్ట భయం ఉన్న రుణాల వైపు అస్సలు వెళ్ళకపోవటం కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ స్థానంలో ఉండటానికి కారణం అని తెలుస్తోంది. 
 
కార్పొరేట్ రంగం నుండి రిటైల్ నమూనాలోకి, రిటైల్ నమూనా నుండి డిజిటల్ నమూనాలోకి వేగంగా మారటం కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అగ్రస్థానంలో కొనసాగటానికి కారణమైందని తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇదే హవాను కొనసాగించే అవకాశం ఉందని బ్యాంకు వాటాదారులు ధీమాతో ఉండటం విశేషం. 
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: