దేశవ్యాప్తంగా ఈసిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో ఇకనుంచి ఈ-సిగరెట్లు అమ్మినా, వాడినా నేరమే.  ఈ-సిగరెట్లను 77 శాతం మైనర్లే వాడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో చెప్పినట్టుగానే ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతిపై బ్యాన్ విధించినట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు.  


కేంద్రం ఈ సిగరెట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీటి తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వ, ప్రచారం అన్నిటిపై బ్యాన్ విధించింది. ఈ సిగరెట్ల వల్ల యువతపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సాధారణ సిగరెట్లను ప్రోత్సహించటం లేదని, ఇతర దేశాల అనుభవాలతో ఈ సిగరెట్లపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ తయారు చేసిన బృందానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. మోడీ ప్రభుత్వం తొలి100 రోజుల ఎజెండాలో ఈ-సిగరెట్ల నిషేధం కూడా ఉంది.


నిజానికి మామూలు సిగరెట్‌, ఈసిగరెట్‌ మధ్య తేడా ఒక్కటే. ఈ-సిగరెట్లో పొగాకు ఉండదు. కానీ సాధారణ సిగరెట్లో ఉండే, ప్రమాదకరమైన రసాయనాలు చాలావరకు ఇందులోనూ ఉంటాయి. సాధారణ సిగరెట్ లో ఉండే నికోటిన్ ఎలక్ట్రానిక్‌ -సిగరెట్ లోనూ ఉంటుంది. అయితే కొండనాలిక్కి మందేస్తే... ఉన్న నాలిక ఊడిందన్నట్టుగా, అసలు సిగరెట్ మానే ప్రయత్నంలో ఈ- సిగరెట్ కు బానిసలై, యువత ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటోందని నివేదికలు చెబుతున్నాయి. 


ఎలక్ట్రానిక్ సిగరెట్లు  అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాట్రిడ్జ్ లో నికోటిన్ ఉంటుంది. 
ఇందులో.... డీఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి.  


ఈ-సిగరెట్ అయినా, మామూలు సిగరెట్  అయినా సిరలు, ధమనులు ధ్వంసం అవటం, గుండె జబ్బులు రావటం ఖాయం.  ఎలక్ట్రానిక్‌ సిగరెట్లోని పొగలో మామూలు సిగరెట్లతో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తక్కువ  తప్ప,  సేఫ్ ఏ మాత్రం కాదని తేలింది. దీర్ఘ కాలం వాడితే మామూలు సిగరెట్ తో సమానంగా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యే అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం కూడా  ఫ్లేవర్డ్ ఈ-సిగరెట్లను నిషేధించింది. 


పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ఎంతోమంది  ఈ-సిగరెట్‌ ను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని పీల్చడం ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. ఈ- సిగరెట్ బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌ తో ఉండే ద్రవ పదార్థాన్ని మండిచడం ద్వారా వెలువడే ఆవిరి మత్తును కలిగిస్తుంది. పెన్ను రీఫిల్ మార్చినట్లుగా దీనిని ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ-సిగరెట్లలో ఉండే నికోటిన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ-సిగరెట్లు ఉపయోగపడుతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తుండటంతో మరింత మంది వీటికి బానిసలవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: