వనితలకు చీరకట్టుతో వచ్చే అందం.. నిండుతనమే వేరు.. కళ్లెదుట ఎన్ని చీరలు ఉన్నా.. మహిళలు కంచి పట్టు చీరలంటే చూపే మోజు అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు, శుభకార్యాలకు పట్టుచీరలంటే చాలు.. కంచికి వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. వారందరికీ తెలియని విషయమేమిటంటే,  అక్కడి వ్యాపారులే తెలివిగా మదనపల్లి పట్టుచీరలనే కొని, కంచి పట్టుచీరగా బ్రాండింగ్ వేసి అమ్ముకుంటున్నారు. తమకు అవకాశమిస్తే పట్టుచీరలను అందరికీ అందుబాటులోకి తెస్తామంటున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి నేతన్నలు.  


చిత్తూరు జిల్లా మదనపల్లి మగ్గంపై నేసే పట్టుచీరలకు ప్రసిద్ధి. 20 వేల మగ్గాలు.. కంచిపట్టు చీరల తయారీతో పాటు అనుబంధంగా దారం తీయడం,  దారాలకు రంగుల అద్దకం పనులతో యువత ఉపాధి పొందుతున్నారు. కొంతమంది సొంతంగానే నేత పని చేస్తుండగా,  మరికొందరు కార్మికులుగా పని చేస్తున్నారు. సాధారణ పట్టుచీరలు నేస్తే ఒక్కొక్క దానికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల చొప్పున దక్కుతుంది మొదటి రకం పట్టు చీరకు 7000 కూలీ గిట్టుబాటు అవుతుంది.  


అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే మదనపల్లె నేతన్నలకు చేనేత మగ్గాల పైనే ఎక్కువ మక్కువ. ఐతే పట్టుచీరకు పట్టుత్వం రావాలంటే మగ్గాలే బెస్ట్ అంటారు నేతన్నలు. రోజులు, నెలలు తరబడి శ్రమించి నేత కార్మికుడు  పట్టు చీరకు ప్రాణం రూపం తీసుకొస్తాడు. ఇక్కడ తయారయ్యే పట్టు చీరలను కంచి పట్టుచీరలకు ధీటుగా నేస్తారు. మదనపల్లి పట్టుచీరకు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలో విపరీతమైన డిమాండ్ ఉంది.  


కాంచీపురంలో చేనేత మగ్గాలు తగ్గి పవర్ లూమ్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిమాండ్ కు తగిన స్థాయిలో పట్టుచీరల తయారీ సాగకపోవడంతో మదనపల్లి పట్టుచీర పైన కన్నేసారు. కొంతమంది వ్యాపారులు తెలివిగా కంచి పట్టుచీర బ్రాండ్ వేసి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శ్రమ తమది అయితే ఫలితం వాళ్ళది వాపోతున్నారు నేతన్నలు. ఇప్పటికైనా తమ శ్రమను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరుతున్నారు నేతన్నలు. కాంచీపురం తరహాలో మదనపల్లి పట్టుచీరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని వేడుకుంటున్నారు. మదనపల్లి చేనేత రంగానికి భౌగోళిక జియోలాజికల్ గుర్తింపు వస్తే, ఎంతోమంది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: