టమోట రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వర్షాల నుంచి టమోట తోటలను కాపాడుకున్నామన్న అన్నదాతల ఆశలు ఎంతోకాలం నిలువ లేదు.  పూత దశకు చేరుకున్న సమయంలో పంటపై ఊజి ఈగలు దాడి చేయడంతో...ఎందుకు పనిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈగలదాడి, గజ్జి తెగుళ్ల కారణంగా  20కోట్లకుపైగా పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు రైతులు.


చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌ టమోట సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారుగా 10 వేల హెక్టార్లకు పైగానే టమోటా సాగు చేపట్టారు రైతులు. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణానికి ఊజి ఈగలు టమోటా తోటలపై దాడికి పాల్పడ్డాయి. పిందె దశలోనే గుడ్లు పెట్టేశాయి. కాయ పెద్దదై పక్వదశకు చేరేటప్పటికే కాయలో పురుగులు ఏర్పడ్డాయి. కాయకు ఈగలు రంధ్రాలు పెట్టి బయటకు వస్తుండడంతో...మొక్క నుంచి కాయ తొడిమ పట్టు కోల్పోయి కిందికి రాలిపోతోంది.  సగానికి సగం దిగుబడులను నష్టపోయే దుస్థితి ఏర్పడిందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.


రామసముద్రం, పుంగనూరు, మదనపల్లె, చౌడేపల్లె, పెద్దపంజాణి మండలాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు అంచనా. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాయలకు గజ్జి ఏర్పడుతోంది. గజ్జి పట్టిన కాయలు కూడా మార్కెట్‌కు పనికి రాకుండా పోతున్నాయి. మదనపల్లె డివిజన్‌ పరిధిలో ఊజి ఈగల దాడి, గజ్జి తెగుళ్ల కారణంగా.... సుమారుగా 20 కోట్లకు పైగానే టమోట పంట  నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు రైతులు.


టమోటా తోటల్లో ఊజి ఈగ నివారణకు పొలం చుట్టూ మొక్కజొన్న పైరు వేసుకోవాలంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు . దీనికి తోడు 14 వరుసల టమోటా మొక్కలకు ఒక్క వరుసలో పసుపురంగు బంతిసాగు చేయాలని,  ప్రతీ ఎకరం విస్తీర్ణంలో నాలుగు బుట్టలు ఏర్పాటు చేసి అందులో క్యూల్యూర్‌ మందును కలిపితే ఈగలు చనిపోతాయని చెబుతున్నారు. అదేవిధంగా 10 పసుపు రంగు జిగురు అట్టలను తోటల్లో వేలాడదీయాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి వేపనూనెను తోటల్లో పిచికారి చేసుకుంటే ఊజి ఈగను పూర్తిగా నియంత్రించ వచ్చంటున్నారు. తెగుళ్ల కారణంగా చేతికొచ్చిన పంటంతా నాశనైందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని టమోట రైతులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: