ఎయిరిండియా రెక్కలూడుతున్నాయ్‌. ప్రభుత్వ విమానయాన సంస్థలో భారీ సంక్షోభం నెలకొంది. పైలట్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడింది. ఎయిరిండియా కూడా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 


ఎయిరిండియాను విక్రయించేందుకు 2001, 2018లో కేంద్రం ప్రయత్నించింది. ఆ రెండు ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం మూడో ప్రయత్నంలో ఉంది మోడీ సర్కార్‌. ఈ సంస్థను గట్టెక్కించేందుకు 2016-17లో 2,465 కోట్లు, 2017-18లో 1800 కోట్లు, 2018-19లో 3,975 కోట్లు సమకూర్చింది కేంద్రం. కానీ 60 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకున్న ఎయిరిండియాను గుదిబండగానే భావిస్తోంది ప్రభుత్వం. ఇదే సమయంలో డిమాండ్లను పట్టించుకోవడం లేదని నిరసన తెలియజేస్తూ.. ఎయిర్‌బస్‌ ఏ320 పైలట్లు 120 మంది రాజీనామా చేశారు. వీరంతా మూకుమ్మడిగా గుడ్‌బై  చెప్పినా విమాన సర్వీసులకు అంతరాయం కలుగదంటోంది సర్కార్‌. చమురు కంపెనీల బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని ప్రకటించింది ఎయిరిండియా. ఇంధన కొరత లేదని, సర్వీసులు ఆగబోవని కస్టమర్లకు హామీ ఇచ్చింది. ఆయిల్‌ కంపెనీలతో ఉన్న సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు ఎయిరిండియా ప్రతినిధులు. 


వాస్తవానికి పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఈసారైనా ఖచ్చితంగా విక్రయించాలని భావిస్తోంది కేంద్రం. ఈ విషయంలో ఇన్వెస్టర్లకు ఉన్న అభ్యంతరాలను కొలిక్కి తేవాలని కసరత్తు చేస్తోంది. అంతా ఓకే అయితే ఈ సంస్థ నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమిస్తుంది. ఉద్యోగుల కోసం ఐదుశాతం వాటా ఉంచుకొని మిగతా 95శాతం వదిలించుకోవాలని చూస్తోంది ప్రభుత్వం. కొనుగోలుదారులపై భారీగా రుణభారం పడకుండా.. ప్రైవేటీకరణ నిబంధనల సడలింపుపై దృష్టిపెట్టింది.


ఎయిరిండియాను ప్రైవేటీకరించినా 24 శాతం వాటాను తన దగ్గరే ఉంచుకోవాలని కేంద్రం భావించడంతో పెట్టుబడి దారులు మందుకు రావడం లేదు. దీనికితోడు కొనుగోలుదారు కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధి లేకుండా వాటాలు విక్రయించుకొనే వెసులుబాటు కల్పించే వీలుంది. లాకిన్‌ నిబంధన పక్కనపెట్టకపోతే రుణాలు లభించవు.



మరింత సమాచారం తెలుసుకోండి: