విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ సెజ్‌ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్‌ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది.  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

బుధవారం సీఎం జగన్తో జరిగిన సమావేశంలో ఆ సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్‌ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ  పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు. 2006లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయగా.... అది నెలకు 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోందన్నారు.



స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలుపుతూ... త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  రానున్న 10 ఏళ్ళలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్‌ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ప్రతి ఉద్యోగికి 12 నెలల పాటు ప్రతినెలా ఇచ్చే రూ.1,500 అలవెన్స్‌తో పాటు ఐదేళ్లపాటు చౌక ధరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్‌ హోదా వచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: