రాష్ట్రంలో సమ్మె కాలం నడుస్తుంది. సమస్యల పరిష్కారం కోరుతూ టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేపట్టిన బంద్ ను సైతం విజయవంతం చేశాయి. ఇప్పడు అదే బాటలో బ్యాంకు ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా 22వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసులో మొత్తం ఆరు అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు బ్యాంకుల విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాయని ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐబిఇఎ), బ్యాంకు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బిఇఎఫ్‌ఐ) నేతలు విమర్శించారు.



ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుండి 12కు తగ్గిపోతాయన్నారు. ఆగస్టులో ప్రకటించిన విలీన ప్రతిపాదనల ప్రకారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో విలీనం అవుతుంది. సిండికేట్‌ బ్యాంకు కెనరా బ్యాంకులోనూ, అలహాబాద్‌ బ్యాంకు ఇండియన్‌ బ్యాంకుతోనూ, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు యూనియన్‌ బ్యాంకులోనూ విలీనం అవుతాయి. వచ్చే ఏడాది విజయబ్యాంకు, దేనాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాను విలీనం కానున్నాయి.
ఈ చర్య వల్ల ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని పేర్కొన్నారు. ఎక్కువ పెనాల్టీలు విధించేలా కేంద్రం సంస్కరణలు చేస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎఐబిఇఎ, బిఇఎఫ్‌ఐ నేతలు ప్రకటించారు. ఎగవేతదారుల నుండి రుణాల రికవరీలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, ఈ పనిచేస్తే బ్యాంకులు బలోపేతం అవుతాయనీ తెలిపారు.




ఇవే డిమాండ్లతో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల యూనియన్లయిన ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐబిఓసి), ఆల్‌ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఎఐబిఓఏ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌బిఓసి), నేషనల్‌ ఆఫీస్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఓబిఓ) గత నెలలో మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. వారి డిమాండ్లను పరిశీలిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నాయి. కానీ  ఎప్పటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ)కు నోటీసు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: