- విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకొచ్చిన అరాచకం 
- ఐదు రోజులు హింసించిన ఒంగోలు పోలీసులు
- చోరీ చేసినట్టు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి
- రూ.6 లక్షలు ఇవ్వాలని బెదిరింపు


చోరీ చేసినట్టు ఒప్పుకోవాలంటూ ఓ విద్యార్థిపై పోలీసులు ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా ఐదు రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన విద్యార్థి పేరం ఆంటోని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంటోనీ ఈ ఏడాది బీటెక్‌ పూర్తి చేసి.. కెనడాలో ఎమ్మెస్‌ చదివేందుకు సిద్దమవుతున్నాడు  ఇదిలా ఉండగా మే 26న ఉదయం ఒంగోలుకు చెందిన ఆరుగురు పోలీసులు ముఖాలకు మాస్కులు వేసుకొని వచ్చి, ఇంట్లో నిద్రిస్తున్న ఆంటోనీని, వరుసకు సోదరుడైన మరో వ్యక్తిని మంచంపై నుంచి బయటకు ఈడ్చుకొచ్చి బూటు కాళ్లతో తన్నుకుంటూ ఆటోలో పడేశారు. 


అదేరోజు మధ్యాహ్నం ఒంగోలు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి లాకప్‌లో వేశారు. అక్కడ ఎస్సై కమలాకర్‌ అతడి కాళ్లు, చేతులకు బేడీలు వేసి చిత్ర హింసలకు గురి చేశారు. ఇటీవల ఒంగోలులో బంగారం, చీరలు చోరీ తానే చేశానని ఒప్పుకోవాలని, రూ.6 లక్షలు నగదు లేదా 20 కాసుల బంగారాన్ని రికవరీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. లేకపోతే లాకప్‌ డెత్‌ చేస్తానని, తప్పుడు కేసు బనాయించి భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించారు. ఆంటోనీ తల్లికి ఫోన్‌ చేసి అతడిని కొడుతున్న దెబ్బలను ఆమెకు వినిపించారు.


 మే 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఒళ్లంతా పుండ్లు పడేలా కొట్టి, అతనిపై ఐపీసీ 109 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత చార్జీలు ఇచ్చి ఆంటోనీ, అతని సోదరుడిని పంపించివేశారు. మే 30న మధ్యాహ్నం ఇంటికి చేరిన ఆంటోనీ తన భవిష్యత్తు నాశనం చేసి, తనపై దొంగతనం ఆరోపణ మోపడంతో అవమానానికి గురైన ఆంటోనీ అదే రోజు రాత్రి సూసైడ్‌ నోట్‌ రాసి, హైదరాబాద్‌లో ఉంటున్న తన అక్కకు మెసేజి పెట్టి ఎలుకల మందు తిన్నాడు. తల్లి అతడిని వెంటనే మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న ఆంటోనీ మొత్తం వ్యవహారంపై ఆదివారం రాత్రి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: