చారు అంటే పూర్తిగా ఆంధ్రులదే అని చెప్పుకోవాలి.కొంచెంచింతపండు,ఉప్పు,పచ్చిమిర్చి,కరివేపాకు,ఇంగువ వేసి తక్కువ ఖర్చుతో,తక్కువ శ్రమతో తయారు చేసే ఆరోగ్యకరమయిన,రుచికరమయిన వంట ఈ చారు..ఎన్ని వంటాకాలున్న ఆఖరికి మజ్జిగా అన్నం ముందు చారు అన్నం తిననిదే భోజనం పూర్తి అయినట్లుగా అనిపించదు. చారుల్లో కూడ పప్పుచారు,టమాటో చారు,ఉలవచారు,నిమ్మకాయచారు,మిరియాలచారు,ఇలా ఎన్నో రకాలుఉన్నాయి.జలుబు చేసినప్పుడు మిరియాల చారు ఘాటుగా గొంతు దిగుతూ ఉంటే ఎంతో ఉపశమనంగా వుంటుంది.ఎక్కడయినా రెండు రోజులు విందు భోజనం చేసి ఇంటికి వచ్చాక కమ్మగా కొంచెం చారు అన్నం తింటే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది.చారుకి పోపు వేస్తె ఇల్లంతా ఘుమఘుమలే,ఇంక కుంపటిమీద సత్తుగిన్నెలో కాచిన ఆ చారు,రుచే వేరు.ఆ అనుభూతి ఆస్వాధిస్తేనే తెలుస్తుంది.ఇన్ని చారులున్న చార్లల్లో కొబ్బరి పాల చారు ఒకటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. 



కావలసినవి::చింతపండు–ఒక టేబుల్‌ స్పూను..వేడి నీళ్లు–అరకప్పు..చారు కోసంనీళ్లు–ఒకటిన్నరకప్పులు..పసుపు–పావు టీ స్పూను..చారు పొడి–ఒక టేబుల్‌ స్పూను..చిక్కటి కొబ్బరి పాలు–ఒక కప్పు..ఉప్పు–తగినంత..పోపుకోసం కొబ్బరినూనె–ఒక టేబుల్‌ స్పూను..ఆవాలు–అర టీ స్పూను..ఎండు మిర్చి–2 (ముక్కలు చేయాలి)..ఇంగువ–చిటికెడు.. కరివేపాకు–రెండు రెమ్మలు..పైన చల్లడానికి కొత్తిమీర–రెండు టేబుల్‌ స్పూన్లు...



తయారీ విధానం::అర కప్పు వేడినీళ్లలో చింతపండును సుమారు అర గంటసేపు నానబెట్టాలి.నానిన చింతపండును గట్టిగా పిండి పిప్పితీసేసి,రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి,పసుపు,చారు పొడి వేసి బాగా కలియబెట్టి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి మరిగించాలి.బాగా మరిగిన తరవాత మంట ఆర్పేసి,కొబ్బరి పాలు జత చేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి..తర్వాత చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడి చేశాక, కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.ఇప్పుడు ఎండు మిర్చి,ఇంగువ,కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపేయాలి వేయించిన పోపును కొబ్బరి పాల చారులో వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.చివరగా కొత్తిమీర జత చేసి అన్నంలో వడ్డిస్తే వచ్చే రుచిని ఆస్వాధిస్తూ లొట్టలేసుకుంటు తింటారు ఎవరైన.


మరింత సమాచారం తెలుసుకోండి: