ఒకప్పుడు బంధువుల ఇళ్లల్లో,కాని మన యింట్లో కాని పెళ్లంటే ఎంత సందడిగా వుండేది.పెళ్లి పేరుతో ఎక్కడెక్కడి బంధువులు వచ్చి ఆప్యాయంగా పలకరించుకునే వారు.వారం పది రోజుల సందడి ఇళ్లంతా చెప్పలేని హడావుడి.కాని ఇప్పటి పెళ్లిలు చూస్తే,వచ్చామా,గిఫ్ట్ తెచ్చామా,పెట్టింది తిని వెళ్లామా.అంతా యాంత్రికంగా జరుగుతుంది.అప్పటివాళ్ళు ఇంత మంది బంధువులకు పది కూరలు వండి వడ్డించేవాళ్ళు కాదు. చక్కగా అరటి ఆకులో వేడి అన్నంలోకి ముద్దపప్పు,దప్పళం,నెయ్యి దానిలోకి ఒక అప్పడం,సగ్గుబియ్యపు పాయసం,గడ్డ పెరుగు వడ్డించేవాళ్ళు.ఎంతబాగుండేది ఆ భోజనం.అదే దప్పళం ఈ రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు.అందుకే ఆనాటి దప్పళం రుచిని మరో సారి టెస్ట్ చేసి చూపుదాం.ఇందులో మేము చెప్పిన కూరగాయలే వేయాలి అని లేదు ఎవరికి నచ్చినవి వారు వేసుకోవచ్చు.సొరకాయ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇకరెడినా..



కావలసిన వస్తువులు:
తీపి గుమ్మడి కాయ ముక్కలు1/4కప్పు..సొరకాయ ముక్కలు1/4 కప్పు..ములక్కాడ ముక్కలు6..టమాటా ముక్కలు ఒక కాయవి.. క్యారెట్ 2...ఉల్లిపాయలు 3...పచ్చిమిర్చి3... ఉప్పు,కారం రుచికి సరిపడ...బెల్లం తురుముకొంచం...చింతపండు నిమ్మకాయంత...కరివేపాకు 2 రెమ్మలు.. పసుపు,ఇంగువ చిటికెడు...ఆవాలు 1/4 స్పూన్...మెంతులు 6...జీర 1/2 స్పూన్...వెల్లుల్లి రెబ్బలు 2...ఎండుమిర్చి 1...



తయారీ విధానం..
కూరగాయ ముక్కలు కొంచం పెద్దగా కోసుకోవాలి..ఉల్లిపాయలలో ఒకదానిని సన్నని ముక్కలుగా తరగాలి..చింతపండుని నీళ్ళల్లో నానపెట్టుకోవాలి..స్టౌవ్ మీద చిన్న కుక్కర్ లేదా ఏదన్న పులుసు చేసుకునే గిన్నె పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి.కాగక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.అవి చిటపటలాడాక అందులో మెంతులు,జీర,ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టి అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి.అవి వేగాక అందులో మిగిలిన ఉల్లిపాయను పెద్దగా కోసిన ముక్కలు,అన్ని కూరగాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తురుము, పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2నిమిషాలు మగ్గనివ్వాలి.కొంచం సేపు మగ్గాక అందులో రుచికి సరిపడ ఉప్పు, కారం(సంబారు కారం అయితే బాగుంటుంది) వేసి కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి.ఇప్పుడు అందులో కొంచం నీళ్ళు వేసి మూత పెట్టి ముక్కలను ఉడకనివ్వాలి.ముక్కలు ఉడికాక అందులో చిక్కగా పిండిన చింతపండు రసం, బెల్లం తురుము వేసి కలిపి మూత పెట్టి పులుసు దగ్గర పడేవరకు ఉడికించుకుని కొత్తిమీర తురుము మరి కొంచం వేసి కలిపి దించి సర్వ్ చేయాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: