క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రోజురోజుకూ మహమ్మారి ఉద్ధృతి పెరుగుతోంది. చైనా నుంచి ఐరోపాలో తొలుత పాదం మోపిన కరోనా వైరస్.. తర్వాత అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది. క‌రోనా ధాటికి పేద దేశాల నుంచి అగ్రరాజ్యాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 50 ల‌క్ష‌లు క‌రోనా కేసులు దాటిపోయింది.

 

వీరిలో దాదాపు 16 లక్షల బాధితులు ఒక్క అమెరికాలోనే ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 3.26 లక్షల మందికిపైగా ప్రాణాలను కోల్పోయారు. ఇదిలా ఉంటే.. క‌రోనా వ‌ల్ల కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. కరోనా సమాచారం పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘సెర్బెరస్‌’ అనే బ్యాంకింగ్‌ ట్రోజాన్‌ను మొబైల్స్‌కు పంపి అకౌంట్లలో డబ్బును దోచేస్తున్నారు. కరోనా సమాచారం ఇస్తున్నట్లు సైబర్ నేర‌గాళ్లు మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేయమని చెబుతున్నారు. పొర‌పాటున ఆ లింక్‌పై ట్యాప్‌ చేయగానే మొబైల్స్‌లోకి స్పైవేర్‌ వచ్చి చేరుతుంది. ఫోన్‌ వెంటనే సైబర్‌గాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. 

 

ఆ వెంట‌నే బ్యాంక్ అకౌంట్లలో డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. కాగా,  అంతర్జాతీయ నేర నియంత్రణ సంస్థ ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో ‘సెర్బెరస్‌' అనే ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ గురించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అన్ని రాష్ర్టాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ క్ర‌మంలోనే కరోనా సమాచారం పేరుతో మొబైల్స్‌కు వచ్చే లింక్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సీఐడీ అధికారులు. లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దన్నారు.. పొరపాటున క్లిక్ చేసినా.. ఇన్‌స్టాల్‌ చేయడానికి అనుమతించొద్దని హెచ్చ‌రిస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: