సమాజంలో బాలికలపై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. వారిపై లైంగిక వేదింపులు, దాడులు జరుగుతున్నాయి. ఏదో ఒకచోట నుంచి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ పటాన్ చెరు ఏరియాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పని చేస్తున్న 14ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా 70ఏళ్ల వృద్ధుడు లైంగికదాడికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆ బాలిక మూడు నెలల గర్భవతి కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాలిక తండ్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి....
తెలంగాణలోని మెదక్ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12ఏళ్ల క్రితం వచ్చారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 14ఏళ్ల కుమార్తె అదే గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 70ఏళ్ల బషెట్టిగారి దయానంద్ ఇంట్లో పని చేస్తోంది. అయితే.. బషెట్టిగారి దయానంద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరింపులతో లొంగదీసుకున్నారు. అప్పటి నుంచి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు భయపడింది. సుమారు ఆరు నెలల నుంచి బాలిక ఈ దారుణాన్ని భరిస్తూనే ఉంది.
అయితే.. వారం రోజుల నుంచి బాలికకు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పి వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఓ ఆస్పత్రిలో వైద్యులకు చూపించారు. దీంతో పరీక్షించిన వైద్యులు బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయమై బాలిక తండ్రి బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో పనిచేస్తున్న బాలికపై ఇంత దారుణానికి పాల్పడుతాడా..? అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.