కేర‌ళ‌లో అతి పాశ‌వికంగా  గర్భిణీ ఏనుగును హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఆక‌లితో ఉన్న గ‌ర్భిణీ ఏనుగుకు పైనాపిల్‌ (అనాస పండు)లో పేలుడు పదార్థాలు పెట్టి తినిపించి చంపిన‌‌‌ ఘ‌ట‌న‌పై  భార‌త‌దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. అనేక మంది జంతు ప్రేమికులు నిర‌స‌న‌ల‌కు దిగారు. రోజురోజుకు మూగ‌జీవాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ప్ర‌భుత్వాలు ఉదాసీన‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆందోళ‌న‌ల‌కు దిగ‌డంతో ఇప్పుడు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు కూడా ఈ కేసులో నిందితుల‌ను అరెస్టు చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కేసును చేధించేందుకు ఏకంగా ప్ర‌త్యేకంగా అట‌వీశాఖ‌ పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేయ‌డం గ‌మనార్హం. 

 

అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్‌ కృష్ణన్‌ అనే అటవీ అధికారి ద్వారా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. దీనిపై ఇప్పుడు కేర‌ళ‌లో పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తోంది. పైనాపిల్ బాంబును ప్ర‌యోగించి ఏనుగు మృతికి కార‌ణ‌మైన‌ కేసులో పోలీసులు శుక్రవారం ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు పేలుడు పదార్థాలను అమ్ముతాడని అట‌వీశాఖ‌ పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ లో తేలింది. మిగతా నిందితుల కోసం వెతుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 

 

ఇదిలా ఉండ‌గా ఏనుగును చంపిన సంఘ‌ట‌న‌పై  కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ ద‌ర్యాప్తుకు ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో లింక్ ఉన్న ముగ్గురు అనుమానితులను అట‌వీశాఖ పోలీస్ అధికారులు గురువారం గుర్తించారు. విచార‌ణ కొన‌సాగుతోంది. వారినుంచి కొంత స‌మాచారం ల‌భిస్తే ద‌ర్యాప్తు మ‌రింత ముందుకు సాగుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఏనుగును హతమార్చిన సంఘ‌ట‌న‌పై సినీ, రాజ‌కీయ‌,క్రీడా ప్ర‌ముఖులు స్పందించారు. మ‌నుష్యుల రూపంలో రాక్ష‌సులు తిరుగుతున్నార‌ని కామెంట్లు పెడుతున్నారు. ఏనుగును చంప‌డం త‌న‌ను తీవ్రంగా బాధిస్తోంద‌ని భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ కోహ్లి ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: