గ‌త కొంత‌కాలంగా చ‌త్తీస్‌గ‌డ్ అడ‌వుల్లో ఏనుగులు వ‌రుస‌గా మృతిచెందుతున్న సంఘ‌ట‌న‌లు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇప్ప‌టికే మూడు ఏనుగులు వివిధ ప్ర‌మాదాల్లో మృతిచెందిన‌ట్లు చెప్పిన అట‌వీశాఖ అధికారులు తాజాగా మంగ‌ళ‌వారం మ‌రో రెండు ఏనుగులు మృతిచెందిన‌ట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌, ధంతరి జిల్లాల్లో రెండు ఏనుగులు చనిపోయా యి. ఈ వారంలో మరణించిన ఏనుగుల సంఖ్య ఐదుకు చేరింది. రాయ్‌గఢ్జిల్లాలో కరెంట్‌‌ షాక్‌‌తో గజరాజు మృతిచెందగా, ధంతరి జిల్లాలో బురదలో కూరుకుని ఏనుగు పిల్ల చనిపోయింది. పొలంలో బోరు కోసం అక్రమంగా వేసిన కరెంటు వైరు తగలడం వల్ల ఏనుగు మరణించినట్టు రాయ్‌గఢ్ ఎస్పీ సంతోశ్సింగ్ తెలిపారు. గాంగ్రెల్ రిజర్వాయర్ ఏరియాలోని ఉర్పుతిలో ఏనుగు పిల్లమృతదేహం దొరికింది. నీటి కోసం వచ్చి బురదలో చిక్కుకుని మరణించి ఉంటుందని ఫారెస్ట్ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే దీనిపై విచార‌ణ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

 

ఇదిలా ఉండ‌గా కేరళలో గర్భిణీ ఏనుగు హత్యపై యావత్ దేశం భగ్గుమన్న విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా కేర‌ళ అడ‌వుల్లో అనుమానాస్ప‌ద స్థితిలోనే ఓ  ఏనుగు చనిపోయింది. ఉత్తర నీలాంబుర్ అడవుల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఏనుగును అటవీ శాఖ అధికారులు కాపాడి.. ఐదు రోజులుగా చికిత్స అందించారు. అయితే అప్ప‌టికే ఆరోగ్యం బాగా క్షీణించి మ‌ర‌ణించింది. ఇటీవ‌లి కాలంలో ఏనుగుల మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లు అధికారులు గుర్తించారు.వృద్ధాప్యం, ప్రమాదం, ఇతర జంతువులతో పోట్లాడడం వంటి కారణాలతో చనిపోతే సహజ మరణంగా పేర్కొంటారు. 


వేట, కరెంట్ షాక్, పేలుడు, వాహనాలు ఢీకొట్టడం వంటి కారణాలతో చనిపోతే అసహజ మరణంగా పరిగణిస్తారు. వాస్త‌వానికి గ‌తంలో ఏనుగుల మృతి త‌మిళ‌నాడు అడ‌వుల్లో ఉండేద‌ని అధికారులు చెబుతున్నారు. ఏనుగు దంతాల అక్ర‌మ ర‌వాణాయే అందుకు కార‌ణ‌మైంద‌ని అట‌వీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేరళలోనే  ఈ సంవత్సరం 50 ఏనుగులు చనిపోయాయ‌ని తెలిపారు. అయితే  వీటిలో 47 ఏనుగులు సహజ మరణం పొందగా.. మరో 3 ఏనుగులు అసహజ మరణం పొందాయ‌ని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అడ‌వుల్లో 2019లో మొత్తం 120 ఏనుగులు మృత్యువాతపడ్డాయి. వీటిలో 110 సహజ మరణం, 10 అసహజ మరణం పొందినట్లు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: