దేశ వ్యాప్తంగా ఏదో దుర్ఘ‌ట‌న‌లో ఏనుగులు మ‌ర‌ణించ‌డం జ‌రుగుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రం వేట‌గాళ్ల అఘాయిత్యాల‌కు బ‌ల‌వుతుండ‌గా..మరికొన్ని వివిధ ప్ర‌మాదాల్లో చిక్కుకుని ప్రాణాలొదులుతున్నాయి. గ‌త మూడు నెల‌ల కాలంలోనే వంద‌ల సంఖ్య‌లో ఏనుగులు మృతిచెందిన‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించిన నివేదిక‌ల ఆధారంగా తెలుస్తోంది. అయితే చాలా మ‌ట్టుకు సాధార‌ణ మ‌ర‌ణాలేన‌ని పేర్కొంది.ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే కేరళ రాష్ట్రంలో నోట్లో క్రాకర్స్‌  ఉంచి  ఓ ఏనుగును చంపిన దుండగుల ఉదంతం మరిచిపోక ముందే చిత్తూరు జిల్లాలో మరో ఏనుగు మృత్యువాత పడింది.


రెండు రోజుల క్రితం  అటవీప్రాంతం నుంచి ఏనుగు శరీరం కుళ్లిపోయి వాసన వస్తుండడంతో అటువైపు వెళ్లిన పశువుల కాపరులు ఏనుగు కళేబరాన్ని గమనించారు. పశువుల కాపారులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని ఏనుగు కళేబరాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.  అయితే ఈ ఏనుగు బండరాయి నుంచి జారిపడిందా ? ఏనుగుల  మధ్య జరిగిన దాడుల్లో గాయపడి మృతి చెందిందా అనే విషయంపై అట‌వీశాఖ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జంతు  ప్రదర్శనశాల వైద్యుడు తోయిబా సింగ్‌  సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. 


ఏనుగు చనిపోవడానికి గల కారణాలు వైద్యులు అందించే నివేదికను బట్టి నిజాలు తెలుస్తాయని  అధికారులు చెబుతున్నారు. అయితే ద‌ర్యాప్తును మాత్రం చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. వాస్త‌వానికి కొంత‌కాలంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం  కేసిపెంట గ్రామ అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ అడ‌వుల నుంచి కూడా ఏనుగులు ఇక్క‌డికి వ‌ల‌స వ‌స్తున్న‌ట్లుగా అధికారులు గ‌తంలో గుర్తించారు. ఇదిలా ఉండ‌గా ఒడిషా నుంచి విజ‌య‌న‌గ‌రం గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఏనుగులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట‌వీశాఖ అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: