దేశంలో కాంగ్రెసేత‌ర పార్టీ కావొచ్చు.. కాంగ్రెసేతర కూట‌మి కావొచ్చు.. రెండోసారి అధికారంలోకి అందునా.. అతిపెద్ద మెజారిటీతోటీ అవ‌త‌రించిన ప్ర‌భుత్వం శ్రీమాన్ న‌రేంద్ర మోడీది! ఇది నిజంగా స్వ‌తంత్ర భార ‌త దేశ చ‌రిత్ర‌లో అతిపెద్ద రికార్డుగా నిలిచిపోయింది. రెండోసారి కూడా మోడీ ప్ర‌ధాని అవుతార‌ని ఎవ‌రూ ఊ హించ‌లేదు. అంతెందుకు బీజేపీ మూలం అయిన ఆర్ ఎస్ ఎస్ కూడా మోడీ మ‌రోసారి ప్ర‌ధాని పీఠం లోకి వ‌స్తార‌నుకోలేదు. కానీ, ఆయ‌న అంద‌రి అంచ‌నాల‌నూ త‌ల‌ద‌న్నుతూ.. అధికారం అందిపుచ్చుకు న్నారు. ఈ క్ర‌మంలో వందేళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్‌ను తుత్తునియ‌లు చేశారు. పార్ల‌మెంటులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం దేబిరించే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చారు. దీనికి కార‌ణం ఏంటి?  రెండో సారి కూడా అధికారం ద‌క్కించు కునేందుకు మోడీ చేసిన విన్యాసం ఏంటి? 


ఇదొక చ‌ర్చ అయితే. రెండోది.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంలో మోడీ చేసిన మెరుపులు ఏంటి?  ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ప‌డుతున్న మార్కులు ఎన్ని? అనేదే! ఈ విష‌యంలోనూ మోడీ ప్ర‌జ‌ల‌ను త‌న విన్యాసంతో మొద‌టిదానికే ప‌రిమితం చేసి.. దానిపైనే చ‌ర్చించుకునేలా చేస్తున్నారు త‌ప్పితే..త‌న ఏడాది పాల‌న‌పై చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే లేదు. కొంద‌రు మోడీ జాతీయ వాదాన్ని ఎత్తుకున్నార‌ని, దేశ భ‌క్తిని భుజాన త‌గిలించుకున్నార‌ని చెబుతున్నారు. కానీ, వాస్త‌వానికి  ఈ రెండింటి కంటే కూడా మోడీ ఎత్తుకు న్న‌ది, భుజాన త‌గిలించుకున్న‌ది.. కేవ‌లం మెస్మ‌రిజం(గారిడీ). ఎక్క‌డ ఎవ‌రిని రెచ్చ‌గొట్టి సెంటిమెంటు ను పిండాలో.. ఎవ‌రికి ఎక్క‌డా తాళం వేసి.. ఆడించాలో.. మోడీకి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు! 


ఈ రెండు విష‌యాల్లోనే కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. కాంగ్రెస్‌లోనూ జాతీయ వాదం ఉంది.. బీజేపీలోనూ దేశ భ‌క్తి ఉంది. హిందూత్వం కోసం.. ఎంత‌కైనా తెగించింది. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌న మేన‌రిజంతో మ‌చ్చిక చేసుకోవ డంలోను, త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోను మోడీ వేసిన అడుగుల ముందు కాంగ్రెస్ దిగ‌దుడుపు అయింది. అదేస‌మ‌యంలో జాతీయ , రాష్ట్రీయ మీడియాల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ మోడీ సంపూర్ణంగా స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ప్రాంతీయ పార్టీల‌ను కూడా త‌న‌దైన శైలిలో ఆడిస్తున్నారు. అదేస‌మ‌యంలో విప‌క్షాల‌పై ఎదురు దాడి చేయ‌డంలోను, మూలాల‌ను వెతికి మ‌రీ.. కాంగ్రెస్‌ను నోరు మూయించ‌డంలోనూ మోడీ స‌హా ఆయ‌న ప‌రివారం పూర్తిగా స‌క్సెస్ అయింది. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలే కాకుండా విదేశాంగ వ్య‌వ‌హారాల్లోనూ..  అప్ప‌టికే ప‌రిచి ఉన్న బాట‌ల‌పైమోడీ ప‌రుగులు పెట్టి.. ఆ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. 


త‌న‌కంటూ.. ప్ర‌త్యేకంగా సంపాయించుకున్న‌ది ఏదైనా ఉంటే ప్ర‌చారం మాత్ర‌మే. `యోగా` విష‌యంలో మోడీ చేసింది ఏంటి?  కొత్త‌గా ఏదైనా సృష్టించారా?  లేక‌,, ఉన్న‌దానినే త‌న భుజాల‌కు ఎత్తుకున్నారా? అంటే..రెండోదే నిజ‌మ‌నాల్సి ఉంటుంది. దీనికి ప్ర‌చారం క‌ల్పించారు. ఈ ప‌నిని కాంగ్రెస్ చేయ‌లేక పోయింది. దీంతో యోగా క్రెడిట్ గంప‌గుత్తుగా మోడీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక‌, రాజ‌కీయాల ప‌రంగా చూసుకున్నా.. ఆయ‌న త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను బెదిరించ‌రు.. వారి వ్యాపారాల‌పై దాడులు చేయించ‌రు.. కేసులు పెట్టించ‌రు..కానీ, ఎలా దారికి తెచ్చుకోవాలో.. అలానే తెచ్చుకుంటారు. వ్య‌క్తిగ‌త వ్య‌తిరేక‌త క‌న్నా.. వ్య‌వ‌స్థీకృత వ్య‌తిరేక‌త పెంచేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలోని గుంటూరులో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన మోడీ.. అప్ప‌టికే ఉప్పు నిప్పుగా ఉన్న చంద్ర‌బాబును ఒక్క‌మాట కూడా వ్య‌క్తిగ‌తంగా అన‌లేదు. 


కానీ, వ్య‌వ‌స్థీకృతంగా దెబ్బ‌తీసేశారు. `స‌న్ రైజ్`‌(కుమారుడి అభ్య‌ద‌యం) కోసం చంద్ర‌బాబు కృషి చేస్తు న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు కేంద్ర ప‌థ‌కాలు.. `ఏటీఎం` మాదిరిగా మారాయన్నా రు. ఈ రెండు విష‌యాలు అప్ప‌ట్లో చంద్ర‌బాబుపై తీవ్ర ప్ర‌భావం చూపించాయి. అయితే, ప్ర‌బుత్వ ఏర్పాటు విష‌యంలో మాత్రం ఏదైనా తేడా వ‌స్తే.. అంతే తీవ్రంగా చ‌ర్య‌లు తీసుకున్నా.. త‌న చేతుల‌కు మ‌ట్టి అంట‌కుండా కూడా చూసుకోవ‌డంలో దిట్ట మోడీ.. ఇవే మ‌న‌కు త‌మిళ‌నాడు శ‌శిక‌ళ విష‌యంలోను బిహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ విష‌యంలోనూ క‌నిపించాయి. పాల‌న విష‌యానికి వ‌స్తే.. గ‌డిచిన ఏడాది కాలంలో పావ‌లా పంచి ముప్పావ‌లా రాబ‌ట్టిన నీతిజ్ఞ‌త మోడీ సొంతం. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గినా.. దేశంలో ఆకాశానికి అంటుతున్నాయి. 


రోజుల‌కు 2 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం కేవ‌లం చ‌మురుపై కేంద్రానికి ల‌భిస్తోంద‌న్న‌ది తాజా గ‌ణాంక‌మే! ఇక‌, వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను కూడా నొప్పి తెలియ‌కుండా పెంచేశారు. నెల రోజుల కింద‌ట 540 గా ఉన్నస‌బ్సిడీ వంట గ్యాస్ ఇప్పుడు 596కు చేరిపోయింది. అనేక రూపాల్లో మోడీ ప్ర‌జ‌ల‌పై వ‌డ్డ‌న సాగిస్తూనే ఉన్నా.. త‌న ప‌దునైన మెస్మ‌రిజంతో ఆయ‌న నెట్టుకు వ‌స్తున్నారు. విదేశాంగ ప‌రంగా చూసుకున్నా.. చైనా దూకుడు విష‌యంలో మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారనే విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. లేకుండా పాతిక మంది సైనిక ప్రాణాలు ఎందుకు గాల్లో క‌లిశాయి? అయినా.. ఈ విష‌యంలోనూ ఆయ‌న త‌ప్పించుకునేందుకు వేసిన అడుగులు.. శ‌భాష్ అని అనిపించుకున్నాయి. స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన లేహ్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్ ‌నాథ్ సింగ్ ప‌ర్య‌టించేందుకు చేసిన ఏర్పాట్లు చివ‌రి నిముషంలో ప్ర‌ధాని మోడీ కోసం మారిపోయాయి. 


వాస్త‌వానికి ఈ స‌మ‌యంలో దేశాధినేత అక్క‌డ‌కు వెళ్ల‌డం ద్వారా మరింత వేడి పెరుగుతుంద‌ని తెలిసి కూడా .. మోడీ వెళ్లారు. అదేస‌మ‌యంలో పాకిస్థాన్‌తో యుద్ధం స‌మ‌యంలో ఇందిర కూడా ఇలానే చేశారం టూ.. కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టారు. అదేస‌మ‌యంలో త‌మ‌కు పెద్ద‌గా సంబంధం లేని.. కాంగ్రెస్ మాజీ నేత‌, దివంగ‌త పీవీ న‌ర‌సింహారావును త‌న భుజాల‌పై మోశారు మోడీ.. ఇక‌, అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మించ‌క త‌ప్ప‌ద‌నే విష‌యం కాంగ్రెస్‌కు తెలిసినా.. ఆ పార్టీ దూకుడు చూపించ‌లేక పోయింది. కానీ మోడీ.. అదే విష‌యాన్ని సాకారం చేసి.. మార్కులు వేయించుకున్నారు. ఇక‌, క‌రోనా విష‌యంలో ఏమీ లేద‌ని పైకి చెబుతూనే .. అంత‌ర్గ‌తంగా  ఆసుప‌త్రుల‌ను పెంచుతున్నారు. స‌మాధుల‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలా మొత్తంగా మోడీ పాల‌న‌లో మెస్మ‌రిజం త‌ప్ప‌.. మ‌రేమీ క‌నిపించ‌డంలేదు. ఈ విష‌యంలో కాంగ్రెస్ చేసిన పొర‌పాట్లు.. తాము త‌ప్ప ఈ దేశానికి అతీగ‌తీ మ‌రెవ‌రూ లేర‌నే మిడిసిపాటు కార‌ణంగానే.. క‌నుచూపు మేర‌లో కూడా సింప‌తీ క‌నిపించ‌కుండా చేసుకుంది!!

మరింత సమాచారం తెలుసుకోండి: