ప‌ట్టు విడుపులు లేని పంతాలు.. అర్ధంప‌ర్ధం లేని జీవితాలు.. ఒక్క‌టే! అవి రాజ‌కీయాలైనా.. అంతే!! నువ్వు పోక‌చెక్క విసిరితే.. నేను త‌లుపు చెక్క విస‌ర‌నా? అనే రాజ‌కీయాలు.. నేత‌లు పెరిగిపోతున్న నేటి రోజుల్లో.. ప్ర‌జ‌లు ఎవ‌రిని విశ్వ‌సించాలో కూడా తెలియ‌డం లేదు. విశ్వాసం.. విశ్వ‌స‌నీయ‌త అనే అత్యంత సున్ని తమైన ప‌డ‌వ‌పై ప్ర‌యాణిస్తున్న వైసీపీలోనూ ఈ త‌ర‌హా నాయ‌కులు పెరిగిపోతున్నారు. ఇది పార్టీకి ల‌బ్ధి చేకూరుస్తుందో లేదో తెలియ‌దు కానీ.. నాయ‌కుల తాత్కాలిక.. ఆనందానికి, వారి ఆవేశం తీర్చుకోడానికి మాత్రం స‌హాయ ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌డిచిన నెల రోజులుగా వైసీపీలో జ‌రుగుతు న్న ప‌రిణామాలు.. తాజాగా మ‌రింత ముదిరి పాకాన‌ప‌డ్డాయి. 


అధికార పక్షం వైసీపీ ప్రజాప్రతినిధులు గ‌తానికి భిన్నంగా రాజ‌కీయాలు చేస్తార‌ని.. గ‌త టీడీపీ నేత‌ల తా లూకు అరాచ‌కాల‌కు చెక్ పెడ‌తార‌ని.. ఆద‌ర్శ‌వంత‌మైన రాజ‌కీయాల‌కు చ‌రిత్ర సృష్టిస్తార‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకున్నారు. అయితే, తాజా ప‌రిస్థితి మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది. సొంత పార్టీ నేత‌లే పరస్ప రం కేసులు పెట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తనను చంపుతామని బెదిరిస్తున్నా రని, తన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఇది వరకే వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకి స్తూ.. ఇసుక, ఇళ్ల స్థలాల్లో అవినీతి జ‌రుగుతోంద‌ని ఆయ‌న మీడియా ముఖంగా రెచ్చిపోయి.. పార్టీని బ‌జారున ప‌డేశారు. 


ఈ క్ర‌మంలోనే ఎంపీ ర‌ఘురామ‌కు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. దీనికి ఆయన నేరుగా జ‌వాబివ్వ‌కుండా డొంక‌తిరుగుడు స‌మాధానం చెప్పారు. పార్టీ ఉనికిని ప్ర‌శ్నించారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ను వైసీపీ కోరింది. దీంతో అయినా.. ఆయ‌న త‌న త‌ప్పును గ్ర‌హించి.. ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేది. కానీ,  తనపై చర్యలు తీసుకోకుండా నిలువరించాలని రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ప‌రిస్థితి హ‌ద్దులు దాటిపోయింది. ఇక‌, ఇప్పుడు  నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎంపీ ర‌ఘురామ‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


వీరిలో ఆచంట ఎమ్మెల్యే, గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ‌ శ్రీరంగనాథరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఉన్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్‌ను, తమను రఘురామరాజు దూషించారని.. తమ దిష్టి బొమ్మలను ఎంపీ అనుచరులు దహనం చేశారని వారు ఫిర్యాదు చేశారు.  గ‌తంలో ఏ పార్టీలోనూ ఇలా సొంత పార్టీ నేత‌లు పోరు పెట్టుకుని.. పరువు తీసుకున్న‌ది లేదు.. పార్టీ ప‌రువును తీసింది కూడా లేదు. కానీ, నేడు వైసీపీ ప‌రువును నేత‌లు త‌మ ఆవేశాల‌ను అణుచుకునేందుకు పోలీస్ స్టేష‌న్ల‌వ‌ర‌కు ఈడుస్తున్నార‌నేది వాస్త‌వం. ఇలాంటి ప‌రిణామాల‌కు శాశ్వ‌త చెక్ పెట్ట‌క‌పోతే.. టీడీపీ ఎదుర్కొన్న విధంగా వైసీపీ కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: